అమరావతిలో తొలిసారి భూసేకరణ ? కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ..!
ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం స్దానికంగా భూములు ఇచ్చే రైతులతో పాటు తమకూ లాభదాయకంగా ఉండేలా 2016లో భూసమీకరణ పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పథకం కింద దాదాపు 40 వేల ఎకరాల భూముల్నీ సమీకరించింది. అయితే ఈ భూసమీకరణ పథకంలో భాగంగా తమ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చి వాటికి బదులుగా అభివృద్ధి చేసిన ఫ్లాట్లను తీసుకునేందుకు కొందరు రైతులు అంగీకరించడం లేదు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణం సాఫీగా జరగాలంటే భూసేకరణ చేపట్టక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది.
ఈ నేపథ్యంలో రైతులు భూసమీకరణకు అంగీకరించని ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టేందుకు సీఆర్డీఏ ఇప్పటికే అంగీకరించింది. రైతులు కోరుకుంటే భూసేకరణ అయినా తమకు ఇబ్బంది లేదని మున్సిపల్ మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో భూసేకరణపై సీఆర్డీఏ ఇచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం రాజధానిలోని మిగతా గ్రామాలపై పడే అవకాశం ఉంటే మాత్రం కేబినెట్ ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

ప్రస్తుతం అమరావతిలో ప్రభుత్వం అమలు చేసిన భూసమీకరణలో అయితే రైతులు ఇచ్చిన భూములకు ప్రతిగా వారికి పదేళ్ల పాటు కౌలు ఇవ్వడంతో పాటు రిటర్నబుల్ ఫ్లాట్లు కూడా ఇస్తారు. కానీ 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం అయితే నేరుగా పరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో ఉన్న ఆర్దిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో భూసమీకరణ ప్లాన్ చేసింది. దీంతో మెజార్టీ భూములు సమీకరించినా ఇంకొన్ని చోట్ల మాత్రం భూసేకరణ తప్పేలా లేదు.

భూసమీకరణకు భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాని నేపథ్యంలో ప్రభుత్వం ఇలా భూసేకరణకు వెళ్తే తలెత్తే ఇబ్బందులపై కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ అమరావతిలో భూసేకరణకు ప్రభుత్వం అంగీకరిస్తే మాత్రం రాజధానిలో ఇలా చేయడం ఇదే తొలిసారి అవుతుంది.












Click it and Unblock the Notifications