ఆటో డ్రైవర్లకు రూ.15 వేల పథకంపై అప్డేట్..! నేడు కేబినెట్లో..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి అమలుతో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు సాయం అందించేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో మరో కొత్త పథకం అమలుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నెల 4న అంటే రేపు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే పథకం అమలు చేసేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఇందులో దాదాపు 3 లక్షల మంది అర్హులుగా తేలారు. దీంతో వీరికి ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే వీటన్నింటికీ ముందు కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ కేబినెట్ లో దీనిపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనున్నారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉంటుంది. ఇందులో ఆటో డ్రైవర్ల పథకానికి ఆమోదముద్ర వేయడంతో పాటు దాదాపు 20 అజెండా అంశాలపై చర్చిస్తారు. అలాగే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024-29కి ఆమోదం తెలపనున్నారు. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు ఆమోదం తెలపనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదిస్తారు.

దీంతో పాటు కారవాన్ పర్యాటకానికి ఆమోదం తెలపనున్నారు. అలాగే అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్‌పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనను, విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులను ఆమోదిస్తారు. చివరిగా కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు.












Click it and Unblock the Notifications