ఏపీలో మరో పథకం అమలుకు నిర్ణయం, భారీగా లబ్ది - మార్గదర్శకాలు..!!
కీలక అంశాలే ప్రధాన అజెండాగా ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. అమరావతి భూముల కేటాయింపుతో పాటుగా సంక్షేమ పథకాల అమలు.. జాబ్ క్యాలెండర్ పైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. వంట గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న వేళ తీసుకోవాల్సిన చర్యల పైన మంత్రివర్గం చర్చించనుంది. అదే విధంగా అధికారిక అజెండా పూర్తయిన తరువాత రాజకీయ అంశాల పైన మంత్రివర్గ సభ్యులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. కాగా.. మరో కొత్త పథకం అమలు పైన ఈ సమావేశంలో చర్చించి.. ఆమోద మద్ర వేయనున్నారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. కొత్త పథకం అమలు పైన నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం ఉపాధి సృష్టి పేరుతో కొత్త పథకానికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ పథకం ద్వారా ఉపాధి పెంచే విధంగా మార్గదర్శకాలు ఖరారు చేసారు. కాగా, మొత్తం 27 ప్రధాన అంశాలు అజెండాలో చేర్చారు. అదే విధంగా ప్రధానంగా సీఆర్డీఏ అథారిటీ లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనునుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇందుకు పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు కేటాయింపు ప్రతిపాదనల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పంచాయితీరాజ్ విభాగంలోని ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాల కేటాయింపు పైనా మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక, రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ప్రస్తుతం కొనసాగుతున్న వంట గ్యాస్ కొరత అంశం పైన కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది.

మంత్రివర్గ సమావేశంలో చర్చ... కీలక నిర్ణయాలు
వంట గ్యాస్ కోసం ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన వేళ ఈ అంశం పైన కీలక నిర్ణయాలు తీసు కునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశం పైన ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కు కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏపీ లో ప్రస్తుతం వంట గ్యాస్ నిల్వలు.. కమర్షియల్ సిలిండర్ల కోసం హోటళ్ల నుంచి వస్తున్న డిమాండ్ల పైన చర్చించనున్నారు. కమర్షియల్ సిలిండర్లు అందక.. హోటల్లు పలు ప్రాంతాల్లో మూత పడుతున్నాయి. అదే విధంగా ఆలయాలు, ఆస్పత్రుల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలనే అంశం పైన కేబినెట్ లో చర్చించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అదే విధంగా బ్లాక్ మార్కెటింగ్ నివారణకు కీలక చర్యలు ప్రకటించనున్నారు. ఇక.. సంక్షేమంతో పాటుగా జాబ్ క్యాలెండర్ ను కేబినెట్ ఖరారు చేయనుంది. అధికారిక అజెండా పూర్తయిన తరువాత రాజకీయ అంశాల పైన మంత్రివర్గ సహచరులతో సీఎం చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications