ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-3 వేలకు పెన్షన్- 25 లక్షలకు ఆరోగ్యశ్రీ-విశాఖలో లైట్ మెట్రో..!
ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు సంక్షేమ పథకాల లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే కాబోయే రాజధాని వైజాగ్ లో లైట్ మెట్రోకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు వచ్చే నెలలో అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలకు జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది.
Recommended Video


ఇవాళ కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల్లో కీలకమైనది వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లో ఉచిత చికిత్స ల పరిమితిని 25 లక్షలకు పెంచడానికి కేబినెట్ ఆమోదం. ఇప్పటివరకూ 5 లక్షలుగా ఉన్న ఈ పరిమితిని ఏకంగా ఐదు రెట్లు పెంచి 25 లక్షలకు తీసుకెళ్లే నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 18న రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు కొత్త కార్డుల్ని ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో పరిమితి కూడా పెరగడం ఊరట కలిగించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. జనవరి 1 నుంచి ఈ పథకం అమలు చేయనన్నారు. అలాగే జనవరి లో అమలు చేసే ఇతర పథకాలు వైఎస్సార్ ఆసరా,వైఎస్సార్ చేయూతకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సామాజిక పెన్షన్ లను ప్రస్తుతం ఉన్న రూ.2750 నుంచి రూ.3000కు పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలాగే కాబోయే రాజధాని విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం విశాఖ లో నాలుగు కారిడార్ లలో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. మరోవైపు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి మంత్రివర్గ సమావేశం సంతాపం తెలిపింది. ఆయన మృతికి సంతాపంగా కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించింది.












Click it and Unblock the Notifications