ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- డీఎస్సీ సహా భారీగా ఉద్యోగాలు, స్కూళ్లలో ఐబీ సిలబస్..
ఇవాళ అమరావతిలో సమావేశమైన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల పలు ఉద్యోగ నియామకాలతో పాటు పలు నియామకాలకు ఆమోద ముద్ర వేసింది. అలాగే వచ్చే నెలలో అమలు చేసే సంక్షేమ పథకాల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో పలు భూకేటాయింపులకు కూడా ఆమోదం తెలిపింది. తాజాగా పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.
ఏపీలో త్వరలో 6100 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. ముందుగా టెట్ నిర్వహించి అనంతరం డీఎస్సీ పరీక్షను నిర్వహిస్తారు. అలాగే రాష్ట్రంలోని 13,171 గ్రామ పంచాయితీల్లో గ్రేడ్ 5 కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపింది. అటవీ శాఖ లో మరో 689 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి కూడా ఆమోదం తెలిపింది.మరోవైపు ఫిబ్రవరి 16 తేదీన చేయూత పథకం నాలుగో విడత కింద మహిళలకు ఇచ్చే నిధులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 26.98 లక్షల మంది మహిళలకు 5 వేల కోట్లు అందిస్తారు.

అలాగే విశ్వ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అలాగే ఏపీలో విద్యుత్ సంస్ధలు రూ.1500 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్ కో, జిందాల్ నియో ఎనర్జీ సహా వివిధ సంస్థ లకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు ఆమోదముద్ర వేసింది. అలాగే అప్పర్ సీలేరు వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఐబీ సిలబస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే విద్యార్ధులకు అన్ని స్కూళ్లలో రాష్ట్ర సిలబస్ తో పాటు ఐబీ కూడా అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో సహజ వాయువు పై పన్నును 24 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ లెజిస్లేచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications