ఎపి రాజధానిపై ముందుకే: విజిటిఎం స్థానంలో సిఆర్‌డిఎ
హైదరాబాద్: భూసేకరణకు కొంత మంది రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకే వేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ - సిఆర్‌డిఎ)ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను బిల్లును రాష్ట్ర ప్రభుత్వం బిల్లును సిద్ధం చేసింది.
సిఆర్‌డిఎ బిల్లు ముసాయిదాపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. రాజధానికి భూముల సేకరణ బాధ్యతను సిఆర్‌డిఎకు అప్పగిస్తారు. దీనికి చంద్రబాబు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సిఆర్‌డిఎ గవర్నింగ్ బాడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తారు.
సిఆర్‌డిఎకు ప్రత్యేక కమిషన్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సిఆర్‌డిఎ ఏర్పాటు కాగానే విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (విజిటిఎం ఉడా) రద్దవుతుంది. విజిటిఎం పరిధిలోని ఆస్తులన్నీ సిఆర్‌డిఎకు బదిలీ చేస్తారు. సిఆర్‌డిఎకు గవర్నింగ్ బాడీతో పాటు ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఉంటుంది. రాజధాని నగరం, రాజధాని ప్రాంతాలుగా విభజన జరుగుతుంది.

రాయపూడి రైతుల వ్యతిరేకత
ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ మాత్రం అంత సులభంగా కానిపించడం లేదు. భూసేకరణపై రైతుల అభిప్రాయలను తెలుసుకోవడానికి వచ్చిన మంత్రుల కమిటీకి ఇటీవల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గుంటూరు జిల్లా తాళ్లూరు మండలం రాయపూడి గ్రామ ప్రజలు రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరించారు. తాము రాజధానికి కూరగాయలు సరఫరా చేస్తామని వారు చెబుతున్నారు.
వర్షం లేకుండా తమ వద్ద కూరగాయలు పండుతాయని, దాదాపు 150 రకాల కూరగాయలను తాము పండిస్తామని, తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని వారు చెప్పారు. భూసేకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు కూడా శ్రీకారం చుట్టారు. భూములు వదులుకునేది లేదని చెప్పారు. తుళ్లూరు మండలం రాయపూడిలో రాజధాని భూముల సేకరణపై శనివారం జరిగిన అభిప్రాయ సేకరణ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
అభిప్రాయ సేకరణలో తమకు మాట్లాడడానికి ఎందుకు సమయం ఇవ్వరని కొందరు రైతులు తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్‌ను ప్రశ్నించారు. వారితో ఎమ్మెల్యే వాగ్వానికి దిగారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు శనివారం రాయపూడిలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు నినాదాలు చేశారు. సమావేశంలో గలాటా సృష్టించవద్దని, మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తామని శ్రావణ్ కుమార్ రైతులకు చెప్పారు. అయినా రైతులు వినకుండా నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications