AP Elections: ఏపీలో రీపోలింగ్ పై ఈసీ కీలక ప్రకటన..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు అధికారికంగా ముగిసింది. అయితే అప్పటికే క్యూలో నిల్చున్న వారికి మాత్రం ప్రత్యేకంగా స్లిప్పులు ఇచ్చి ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఇలా పలు నియోజకవర్గాల్లో ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారు. వీరందరికీ పోలింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 10 గంటలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఇవాళ జరిగిన ఎన్నికల పోలింగ్ లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని పలు జిల్లాల్లోనూ హింస ప్రజ్వరిల్లింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా మాత్రం ఆయా సీట్లలో రీపోలింగ్ నిర్వహించడం లేదని తేల్చిచెప్పేశారు. దీనికి గల కారణాలను కూడా వివరించారు.

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ రాజకీయ పార్టీలు రీపోలింగ్ కోరలేదని సీఈవో ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. దీంతో ఈసీ కూడా వీటిని చెదురుమదురు ఘటనలుగానే చూస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగా రాజకీయ పార్టీల నుంచి రీపోలింగ్ డిమాండ్లు వచ్చినప్పుడు మాత్రమే ఈసీ వీటిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇవాళ జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రధాన పార్టీల నాయకుల ప్రమేయం ఉండటంతో వీటిలో రీపోలింగ్ కు అవి డిమాండ్ చేయలేదని తెలుస్తోంది.
మరోవైపు ఇవాళ సాయంత్రం వరకూ రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అంచనా వేస్తోంది. రాత్రి 10 గంటల కల్లా క్యూలో ఉన్న వారి ఓటింగ్ కూడా పూర్తయితే పోలింగ్ శాతం 80 దాటొచ్చని అంచనా. దీంతో గత ఎన్నికల కంటే ఎక్కువగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా నమోదైన ఎక్కువ ఓటింగ్ ఏ రాజకీయ పార్టీని ముంచుతుందో, ఇంకెవరిని తేలుస్తుందో జూన్ 4న తేలనుంది.












Click it and Unblock the Notifications