టైమ్ కు వచ్చేసిన చంద్రబాబు-అవాక్కైన అధికారులు.?
ఏపీ సచివాలయంలో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సచివాలయం కేంద్రంగా పాలన సాగించేందుకు ఎక్కువగా మొగ్గు చూపే సీఎం చంద్రబాబు ఇవాళ కార్యదర్శులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులతో పాటు విభాగాధిపతులు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వంలో సాధారణంగా అధికారులు కీలక భేటీలకు సైతం సకాలంలో హాజరు కాకపోవడం అలవాటుగా మారుతోంది.
ఇదే క్రమంలో సీఎస్ విజయానంద్ తో పాటు కీలక శాఖల కార్యదర్శులు ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబుతో జరిగే కీలక భేటీకి హాజరు కావాల్సి ఉంది. ఈ మీటింగ్ ప్రారంభ సమయం దగ్గరపడుతున్నా వారు ముందుగా సమావేశం జరిగే ఛాంబర్ కు చేరుకోలేదు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఠంచనుగా వచ్చేశారు. దీంతో ఆయనకు స్వాగతం పలకాల్సిన సీఎస్ విజయానంద్ అక్కడ లేకుండా పోయారు. చివరికి సీఎం పొలిటికల్ సెక్రటరీ చంద్రబాబుకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం సీఎస్, ఇతర అధికారులు అక్కడికి వచ్చారు.

ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పాలన పరుగులు తీయించాలని మంత్రులతో పాటు అధికారుల్ని కూడా పదే పదే సీఎం చంద్రబాబు కోరుతున్న నేపథ్యంలో ఆయన కూడా సమయపాలన పాటిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం సీఎం చంద్రబాబు సకాలంలో వస్తారని భావించలేదని ఈ ఘటన చూస్తే అర్దమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కార్యదర్శుల భేటీకి హాజరై ఎప్పటిలాగే ఫైళ్ల క్లియరెన్స్ పై వారికి దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్షించి, ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని, వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు.
ఆర్థికేతర ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదని, ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటు మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్సు అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈఓ తెలిపారు.మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్య అవుతున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications