చంద్రబాబు ఫోన్ చేస్తే జగన్ ఏమన్నారో తెలుసా?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిన ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈసారి మంత్రివర్గాన్ని సామాజిక సమతూకంతో చంద్రబాబు సరిగ్గా తూశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు
చంద్రబాబు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వెంకయ్యనాయుడు, రజనీకాంత్, చిరంజీవి, జస్టిస్ ఎన్.వి.రమణ తదితరులందరినీ స్వయంగా ఫోన్ చేసి రావాలని ఆహ్వానించారు. అలాగే మర్యాదపూర్వకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఫోన్ చేశారు. అయితే ఫోన్ లో మాట్లాడటానికి జగన్ నిరాకరించాడని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజకీయం రాజకీయమేనని, ఒకసారి ఎన్నికలైన తర్వాత రాష్ట్రాభివృద్ధి అనేది ఒకటే ప్రాధాన్యమవుతుందని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలని చంద్రబాబు గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పారని, అయితే మర్యాదపూర్వకంగా కూడా ఫోన్ లో మాట్లాడటానికి జగన్ నిరాకరించాడని వెల్లడించారు.

నవీన్ పట్నాయక్, జగన్ మధ్య తేడా ఇదే
ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవంగా ఆహ్వానించారని, కానీ జగన్ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారని తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినరోజు మధ్యాహ్నం ఒడిసా ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మోడీ మధ్యాహ్నం ఒడిసా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో కూడా పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి ఒడిసా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. ఆయనతో మోడీ, అమిత్ షాతోపాటు నేతలంతా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. నవీన్ పట్నాయక్ కూడా అందరినీ ఆప్యాయంగా మాట్లాడించారు. ఏపీలో మాత్రం ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానపత్రం తీసుకోవడానికి కూడా జగన్ నిరాకరించాడని టీడీపీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications