ఏపీ టీచర్లకు మరో వార్నింగ్ ? స్కూళ్లలో కుల, మత ప్రస్తావన తెస్తే కఠిన చర్యలు..
ఏపీని రాష్ట్రప్రభుత్వ పాఠశాలలు, ఇతర విద్యాసంస్ధల్లో పనిచేస్తున్న టీచర్లకు మరో షాక్ తగిలింది. రాష్ట్రంలోని పలు స్కూళ్లలో మత పరమైన ప్రచారాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో దీనిపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. స్కూళ్లలో ఇకపై కుల,మత ప్రస్తావనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని టీచర్లకు హెచ్చరికలు పంపింది. ఈ మేరకు బాలల హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ ఓ ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు వివిధ మతాలకు,కులాలకు, వర్గాలకు అతీతంగా విద్యా బోధన చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు సూచించారు.ఇటీవల కాలంలో కొన్ని జిల్లాలలో ఉపాధ్యాయులు మత ప్రచారాలు చేస్తున్నట్టు కమిషన్ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. హిందూ, క్రైస్తవం, ముస్లిం, ఇస్లాం, జైన్,సిక్కు మొదలగు ఏ విధమైన మతాలను పాఠశాలల్లో ప్రచారం ,బోధించడం చేయకూడదని, అలా నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసినట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

స్కూళ్లలో విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు నీతి, న్యాయం ,సేవా గుణం వంటివి నేర్పించాలని బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు. విద్యార్దులు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని, వారి మనస్సులో కుల,మత,వర్గ భేదాలు వంటి బీజాలు నాటుకోకుండా చూడాలని, విద్యార్దుల మనోభావాలు దెబ్బతినేలా ఉపాధ్యాయులు మరియు పాఠశాలల సిబ్బంది ప్రవర్తించరాదని సూచించారు. విద్యార్దులు వారి యొక్క తమ తమ కుల మత ఆచారాలకు,సంస్కృతి,సంప్రదాయాలుకు అడ్డుచెప్పరాదని వాటికి విరుద్ధంగా వారిపై ఒత్తిడి తీసుకొని రాకూడదని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడైన ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలులో,వసతి గృహాల్లో ,పునరావాస కేంద్రాలలో ఇటువంటి నిబంధనలను ఉల్లంఘించినట్టు కమిషన్ దృష్టికి వస్తే తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాలల హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ తెలిపారు. ఈ మధ్య ఇలాంటి ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో బాలల హక్కుల కమిషన్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications