రామోజీ, శైలజా కిరణ్ కు సీఐడీ నోటీసులు - కీలక మలుపు..!!
మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు ను పెంచింది. ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు అయ్యాయి. అలాగే రూ.1,035 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. ఈ క్రమంలోనే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ రామోజీరవు..శైలజా కిరణ్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. జూలై 5న ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసింది. మార్గదర్శిలో నిబంధనలు ఉల్లంఘిచినట్లుగా గుర్తించినట్లు సీఐడీ తేల్చింది. ఇప్పుడు విచారణ కీలక దశకు చేరిందని..ముఖ్య నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.
కొద్ది రోజులుగా మార్గదర్శిలో చోటు చేసకున్న అక్రమాల పైన ఏపీ సీఐడీ విచారణ చేస్తోంది. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు సోదాలు చేపట్టింది. చిట్స్‌ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 1989 చిట్స్ గ్రూపులు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపిన సీఐడీ, ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని తెలిపింది. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తొలి విడతలో మార్గదర్శికి చెందిన రూ..1,035 కోట్ల ఆస్తులను అటాచ్ చేసారు. ఏపీలోని 9 బ్రాంచ్‌లకు సంబంధించిన 23 గ్రూప్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామని, వాటిని మూసివేస్తున్నామని సీఐడీ వెల్లడించింది. వైండప్ చేస్తున్న గ్రూపుల విలువ మొత్తం రూ.604 కోట్లని, 1,025 మంది వినియోగదారులకు సంబంధించిన ఈ మొత్తాన్ని చిట్‌ఫండ్ చట్టం ప్రకారం తిరిగి చెల్లిస్తామని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అన్ని బ్రాంచ్‌ల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వాటినీ వైండప్ చేస్తామని సీఐడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లం ఏపీలోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఆ సంస్థకు 108 బ్రాంచ్‌లు ఉన్నాయని.. ఏపీలోని 37 బ్రాంచ్‌ల్లో 2,351 చిట్ గ్రూప్స్ ఉన్నట్లు గుర్తించామని సీఐడీ అధికారులు వివరించారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ వినియోగదారుల్లో ఏ ఒక్కరూ అడగలేదని, అందుచేత తాము ఎలాంటి తప్పూ చేయలేదని చెప్పడం సరైంది కాదనేది సీఐడీ వాదన. ఈ కేసులో స్టాంప్స్-రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆడిటింగ్ నిర్వహించామని.. ఏ-1 రామోజీరావు, ఏ-2 శైల జా కిరణ్‌ను విచారించామని అధికారులు చెబుతున్నారు. దీనికి కొనసాగింపుగా మరోసారి సీఐడీ అధికారులు ఈ ఇద్దరిని విచారించేందుకు సిద్దమయ్యారు. జూలై 5న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసారు. ఇప్పటికే సీఐడీ తీసుకుంటున్న నిర్ణయాల పైన రాజకీయంగా ఆరోపణలు మొదలయ్యాయి. మార్గదర్శి వ్యవహారంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications