Chandrababu : చంద్రబాబుకు సీఐడీ 50 ప్రశ్నలు-ఇవాళ ఏం జరిగిందంటే ?
ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవల్మెంట్ స్కాంలో సీఐడీ ఇవాళ నిందితుడు చంద్రబాబును సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఇప్పటికే ఈ స్కాంలో అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ రాజమండ్రి జైల్లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఏసీబీ కోర్టు అనుమతి మేరకు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు 120 ప్రశ్నలు సంధించాలని భావించారు.
రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు కాన్ఫరెన్స్ హాల్లో విచారణ జరిపారు. ఉదయం దాదాపు గంటన్నర ప్రశ్నల తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు.. మొత్తం మీద నాలుగు సార్లు బ్రేకులు ఇచ్చినట్లు సమాచారం. 120 ప్రశ్నలు సంధించాలని వెళ్లిన సీఐడీ.. ఇవాళ కేవలం 50 ప్రశ్నలు మాత్రమే సంధించింది. వీటిలో సీమెన్స్ ఒప్పందం, లావాదేవీలపైనే ప్రధానంగా ప్రశ్నించింది.

చంద్రబాబుకు సీఐడీ వేసిన ప్రశ్నల్లో డీపీఆర్ లేకుండా స్కిల్ ప్రాజెక్టు ఎందుకు ఓకే చేయించారన్న దానితో పాటు ఆర్ధిక శాఖ కార్యదర్శి వద్దన్నా ఎందుకు నిధులు విడుదల చేశారు, యూపీ కేడర్ ఐఏఎస్ ను ఎందుకు డిప్యూటేషన్ పై డిప్యూటీ సీఈవోగా తెచ్చారు లాంటి ప్రశ్నలు ఉన్నాయి. వీటితో పాటు సుమన్ బోస్ తో రహస్య ఒప్పందం ఏమైనా కుదిరిందా, గంటా సుబ్బారావుతో జరిపిన ఈమెయిల్ సంభాషణలు, ఆయనకు నాలుగు పదవులు కట్టబెట్టడం వంటి అంశాలపై ప్రశ్నలు సంధించారని తెలిసింది.
ఇవాళ జరిపిన విచారణలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాల్ని సీఐడీ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు రికార్డు చేశారు. అలాగే రేపు కూడా ఈ విచారణ సాగనుంది. ఇవాళ జరిపిన విచారణలో చంద్రబాబు తరఫు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావు కూడా అక్కడే ఉన్నారు. వారి సమక్షంలోనే చంద్రబాబు స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. రేపటి విచారణ తర్వాత సీఐడీ అధికారులు సోమవారం కోర్టుకు సీల్డ్ కవర్ లో వివరాలు సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications