ఏపీ మద్యం డిస్టిలరీల్లో సీఐడీ తనిఖీలు- వైసీపీని ఫిక్స్ చేసేలా.. !
ఏపీలోని మద్యం తయారీ కంపెనీల్లో సీఐడీ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పదే పదే ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కంపెనీలు అందించిన మద్యం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అప్పట్లో ఎక్సైజ్ శాఖ వ్యవహారాన్ని నడిపించిన వాసుదేవరెడ్డిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోని ఎన్టీఆర్ , నెల్లూరు ,ప్రకాశం ,చిత్తూరు జిల్లాలోని పలు డిస్టిలరీల్లో సీఐడీ ఇవాళ సోదాలు నిర్వహిస్తోంది.
ఇందులో ప్రధానంగా 2019-24 మధ్య అమ్మకాలు, సరఫరా పై సీఐడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మద్యం నాణ్యతను కూడా సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న పలు డిస్టిలరీలను కూడా సీఐడీ తనిఖీలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సెంధిని (లిక్కర్)ఫ్యాక్టరీలో సీఐడీ సోదాలు జరుపుతోంది.

ఇవాళ ఉదయం నుంచి మద్యం డిస్టిలరీల్లో రహస్యంగా సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మీడియాను సైతం లోపలికి రానివ్వకుండా సీఐడీ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మద్యం డిస్టిలరీలపై కేసు నమోదు అయిన నేపథ్యంలో ఇవాళ విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సోదాలపై అధికారికంగా సీఐడీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.












Click it and Unblock the Notifications