కొత్త జిల్లాలపై తేల్చేసిన చంద్రబాబు..! కీలక ఆదేశాలు..!
ఏపీలో ప్రస్తుతం ఉన్న జిల్లాలను పునర్ వ్యవస్దీకరించి కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఆయనకు జిల్లాల్లో పర్యటనలు, ఇతర మార్గాల్లో సేకరించిన వివరాలను అందించింది. అలాగే కొత్త జిల్లాలపై ఉన్న డిమాండ్లు, ఇతర పరిస్ధితుల్ని కూడా వివరించింది. అనంతరం సీఎం చంద్రబాబు కొత్త జిల్లాల ఏర్పాటుపై వారికి క్లారిటీ ఇచ్చేశారు.
రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి, పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని సీఎం చెప్పారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఈ ఏడాది జూలై 22న ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.

గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా సీఎం చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ప్రాంతీయ విభేదాలకు కారణమైందని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు భవిష్యత్‌లో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరగాలని నిర్దేశించారు.

రెవెన్యూ డివిజన్ల పునర్వవ్యస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం పూర్తయిన తర్వాత ముంపు మండలాల ప్రజలు ఏ రెవెన్యూ వార్డు, ఏ నియోజకవర్గంలో ఉంటారనేదానిపైనా అధ్యయనం చేసి... దానికి అనుగుణంగా పునర్ వ్యవస్థీకరణ జరపాలన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛ అని సీఎం ప్రస్తావించారు. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ఆయా వర్గాల అభిప్రాయాలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాల పునర్ వ్యవస్ధీకరణపై ఇవాళ తొలి సమావేశంలో పలు అంశాలు చర్చించిన సీఎం... ప్రతిపాదనలపై తదుపరి చర్చలకు వారంలో మరోసారి సమావేశం అవుదామని తెలిపారు.












Click it and Unblock the Notifications