ప్రజల విశ్వాసాలు, పక్క రాష్ట్రాలపై అసూయ: బాబు వివాదాస్పద వ్యాఖ్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కలెక్టర్ల సదస్సు సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుళ్లు, మసీదులు, చర్చిలు లేకుంటే జనాలకు పిచ్చిపట్టేదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
కష్టం వస్తే ప్రజలు దేవుడిని నమ్ముకుంటారని, అందుకే ఎక్కువ తప్పులు చేసి, ఎక్కువ డబ్బులు హుండీల్లో వేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఆ శాఖ ఆదాయం పెరిగిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మద్యం తాగకుండా ఉండం కోసమే కొంతమంది దీక్షలు తీసుకుంటున్నారని కూడా అన్నారని తెలుస్తోంది.
దీక్షలు తీసుకున్న రోజుల్లో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయన్నారు. ఏపీలో దేవాదాయ శాఖ ఆదాయం బాగా పెరిగిందని, ఆ శాఖ ఆదాయ అభివృద్ధికి అధికారులు కష్టపడి పని చేయకపోయినా 27 శాతం పెరిగిందన్నారు. పక్క రాష్ట్రాల అభివృద్ధిని చూసి అసూయ కలుగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల కంటే బాగా పని చేయడం కోసం ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ... ఏపీ రెండేళ్ల పాప లాంటిదన్నారు. చంద్రబాబు విజయవాడలో కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండేళ్ల పాలనపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ ప్రణాళికలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు.
విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉందని, సమష్టి కృషితో గతం కంటే ఆర్థిక ఆదాయం 3.1శాతం పెంచుకోగలిగామన్నారు. గడిచిన రెండేళ్ల పాలనలో కలెక్టర్ల పనితీరు బాగుందన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,07,532గా ఉందని చంద్రబాబు తెలిపారు.
రూ.1,40,648తో విశాఖ ప్రథమ స్థానంలో, రూ.1,40,593తో కృష్ణా జిల్లా రెండోస్థానంలో, రూ.1,21,724తో పశ్చిమ గోదావరి మూడోస్థానంలో ఉండగా, రూ.74,638తో శ్రీకాకుళం జిల్లా చివరిస్థానంలో ఉన్నట్లు తెలిపారు.
2029 నాటికి దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనికోసం అధికారులు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications