జగన్ ఫెయిల్యూర్స్ నుండి పాఠాలు నేర్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు... పోలీసులకు క్లాస్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు గతానికి భిన్నంగా గత ప్రభుత్వ పాలనలోని వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుని ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ప్రజలకు తనకు మధ్య ఎటువంటి అడ్డుగోడలు ఉండకూడదని నిర్ణయించుకున్న చంద్రబాబు ఇప్పటికే ఆ విషయాన్ని స్పష్టం చేశారు .
టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులకు చంద్రబాబు క్లాస్
తాజాగా మరో మారు నేడు సీఎం హోదాలో తొలిసారి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు పోలీసుల పైన సీరియస్ అయ్యారు. పార్టీ కార్యాలయంలో బారికేడ్లు ఏంటి అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. తాను కార్యకర్తలను కలిసేటప్పుడు బారికేడ్లను పెట్టవద్దని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజలకు తనకు మధ్య అడ్డు గోడలు ఉండకూడదన్న చంద్రబాబు
తనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా వినతల స్వీకరణ కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకువస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా ఆయనే వినే ప్లాన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్ అసలు ప్రజలను కానీ, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎవరిని కలవడానికి అనుమతించేవారు కాదు.
పరదాల సంస్కృతి రుచించని ప్రజలు.. జగన్ ను తిరస్కరించారు
జగన్ వస్తున్నారంటే రోడ్డుపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని నిలిపివేసి, పరదాలు కట్టి, భారీకేడ్లను ఏర్పాటు చేసి, ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే వారు. వైయస్ జగన్ పాలనలో సాగిన ఈ విధానం ప్రజలకు ఏమాత్రం రుచించలేదు. జగన్ వస్తున్నాడు అంటే రోడ్డుపైన అడ్డున్న చెట్లను కూడా ఎక్కడికి అక్కడ నరికి వేసేవారు. ఫలితంగా ప్రజలు తాజా ఎన్నికల్లో జగన్ ను రిజెక్ట్ చేశారు.
ప్రభుత్వం మారినా మారని పోలీసుల తీరు.. చంద్రబాబు ఆగ్రహం
ఇక ఐదేళ్లపాటు జగన్ పాలనలో పోలీసులు సీఎం కోసం పరదాలు కడుతూ, బారికేడ్లు ఏర్పాటు చేస్తూ ఏ విధంగా అయితే పని చేశారో ప్రస్తుతం కూడా అదే విధానంలో పనిచేయడం చంద్రబాబుకు ఏమాత్రం నచ్చటం లేదు. ప్రభుత్వం మారినా ఐదేళ్ళ అలవాటు పోలీసులకు మారటం లేదు. అందుకే చంద్రబాబు పదే పదే పోలీసులను హెచ్చరిస్తున్నారు.
జగన్ చేసిన తప్పు తాను చెయ్యకుండా చంద్రబాబు జాగ్రత్తలు
ఈ పరదాలు కట్టడం, బారికేడ్లు పెట్టడం మానుకోవాలని పోలీసులను హెచ్చరిస్తున్నారు. అంతేకాదు జగన్ చేసిన పొరపాట్లు తమ పాలనలో జరగకుండా ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా తన పాలన సాగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే జగన్ చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని జాగ్రత్త పడుతున్న చంద్రబాబు ముందు నుండే పోలీసులకు క్లాస్ పీకుతున్నారు.












Click it and Unblock the Notifications