ఎన్నిసార్లు చెప్పినా మారరా..? మంత్రులపై బాబు సీరియస్..!
ఏపీలోని అమరావతి సచివాలయంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అలాగే వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో తాజా పరిణామాలపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ప్రభుత్వానికి వస్తున్న చెడ్డపేరుపైనా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులపై చంద్రబాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
కేబినెట్ లో ప్రధాన అజెండాపై చర్చ తర్వాత మంత్రులతో రాష్ట్రంలో పరిణామాలపై చర్చించిన చంద్రబాబు.. మతపరమైన విషయాల్లో వైసీపీ చేస్తున్న విమర్శలపై ప్రశ్నించారు. వీటికి మంత్రులు ఎందుకు గట్టిగా కౌంటర్ చేయడం లేదని చంద్రబాబు వారిని నిలదీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాజాగా తిరుపతిలో గోవుల మృతిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫేక్ ఆరోపణలు చేసినా మంత్రులు ఎందుకు కౌంటర్ చేయలేదని మంత్రుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంలోనూ మంత్రులు ఇలాగే నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జిల్లాల్ని యూనిట్ గా తీసుకుని సంక్షేమ పథకాల అమలును జనంలోకి తీసుకెళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. అలాగే మంత్రుల పేషీల్లో సిబ్బంది చేస్తున్న వరుస తప్పిదాలపైనా సీఎం చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్టీని సీఎంవో జోక్యం చేసుకుని తప్పించిన వ్యవహారాన్ని చంద్రబాబు గుర్తుచేసినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రులు ఇకపై తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని సీఎంకు చెప్పినట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలువురు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. పలు కేబినెట్ భేటీల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇప్పటికీ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అంచనాల్ని అందుకోలేకపోతున్నారనే అసంతృప్తి సీఎం చంద్రబాబులో కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పనితీరుపై రోజుకో సర్వేలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మంత్రులు అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు వారికి సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications