వారికి అదే చివరి రోజు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. తప్పులు చేసేవారి పట్ల చండశాసనుడిగా ఉంటానని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వాలని.. చేతనైతే విలువలు నేర్పించాలన్నారు. వైఎస్ భారతిపై చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన నేపధ్యంలో చంద్రబాబు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
అంతే కాకుండా కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లను చంద్రబాబు పరిశీలించారు. బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సీఎం.. కోటయ్య పశువుల పాకను పరిశీలించారు.. గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా జ్యోతి రావు పూలే స్పూర్తితో ఈచట్టం తెస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు.

అంతే కాకుండా బీసీలకు ఉద్యోగాల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. జిల్లాల వారీగా బీసీ భవన్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని.. బీసీ వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో బీసీ విద్యార్థుల కోసం సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీడీపీకి మొదటి నుంచి బీసీలే వెన్నెముక అని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని.. ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. త్వరలోనే అందరికీ తల్లికి వందనం అందిస్తామని చెప్పారు. మే నెల నుంచి రైతులకు విడతల వారీగా రూ.20 వేలు అందజేస్తామని వివరించారు.
పీ-4తో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. 10 మంది సంపన్నులు 20 మంది పేదలకు చేయూతనివ్వాలన్నదే తమ అభిమతం అని వివరించారు. ఆగిరిపల్లిలో 206 పేద కుటుంబాలను గుర్తించామని, అర్హులందరికీ స్థలం ఇచ్చి ఇల్లు కట్టాకే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారు. కోర్టు సమస్యలు పరిష్కరించి త్వరలోనే చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications