కర్నూల్లో హైకోర్టు బెంచ్-అమరావతిలో లీగల్ కాలేజ్-చంద్రబాబు కీలక నిర్ణయాలు..!
ఏపీలో న్యాయశాఖపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా కర్నూల్లో హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. అలాగే అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వీటితో పాటు లాయర్ల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేబినెట్లో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పుంపుతామన్నారు. దీంతో అమరావతిలో ప్రస్తుత హైకోర్టు కొనసాగుతూనే ఓ బెంచ్ మాత్రం కర్నూల్లో అందుబాటులోకి రానుంది.

అలాగే రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం నిర్ణయించారు. బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ ఇనిస్టిట్యూట్ ను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
మరోవైపు జూనియర్ లాయర్లకు నెలకు 10 వేల గౌరవ వేతనం ఇస్తామన్న ఎన్నికల హామీని కూడా అమలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. జూనియర్ లాయర్లకు శిక్షణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలని సూచించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని...దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్దతులను పాటించాలని సీఎం ఆదేశించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ, అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్ ప్రభుత్వం నుంచి ఉండకూడదన్నారు.












Click it and Unblock the Notifications