జగన్ కు మరో షాక్- తొలి సీఐడీ విచారణ ! అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన..!
ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలన లో చోటు చేసుకున్న అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. దీనికి కొనసాగింపుగా ఇవాళ అసెంబ్లీ వేదికగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో జరిగిన భారీ అక్రమాలకు సంబంధించి తొలిసారి సీఐడీ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ విధానంపై ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పట్లో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యం షాపుల్ని తొలుత తగ్గించి ఆ తర్వాత ఎలా పెంచారో చంద్రబాబు వివరించారు. అలాగే నాసిరకం కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి ప్రజారోగ్యాన్ని ఎలా దెబ్బతీశారో వెల్లడించారు. దీని ద్వారా వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు ఎలా మేలు జరిగిందో పేర్కొన్నారు.

గతంలో మద్యం ధరలు ఇష్టారాజ్యంగా పెంచారని, వాటి ద్వారా మద్యం అమ్మకాలు తగ్గుతాయని ప్రజల్ని వైసీపీ సర్కార్ నమ్మించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే నాసిరకం మద్యం బ్రాండ్లను తెచ్చి భారీగా అమ్మకాలు చేశారని, అయినా ఆదాయం రాలేదన్నారు. ఈ డబ్బులన్నీ వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని చంద్రబాబు ఆరోపించారు. చెల్లింపులు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో దేశంలోనే ఐదు టాప్ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేశారన్నారు.
ప్రభుత్వంలోని ఇతర శాఖల డబ్బు తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడులు పెట్టించారని దీని వల్ల ఆయా శాఖలకు రూ.250 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అలాగే డిజిటల్ చెల్లింపులు చేయకుండా నేరుగా డబ్బులు తీసుకుని మద్యం విక్రయించారన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ అక్రమాలన్నింటినీ సరిచేసి కొత్త మద్యం విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. అంతకంటే ముందు వైసీపీ హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ చేయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మొత్తం నగదు లావాదేవీలపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications