వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో ''తాడికొండ ఎక్స్ ప్రెస్''?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనితీరు మార్చుకోని, ప్రజలతో మమేకం కాని, అధిష్టానం మాట పెడచెవిన పెడుతున్న ఎమ్మెల్యేలందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ''తాడికొండ'' రూపంలో గట్టి హెచ్చరికలు జారీచేశారు. దీంతో ఎమ్మెల్యేలందరికీ తాడికొండ భయం పట్టుకుందంటే అతిశయోక్తి కాదు. ఒకటో, రెండో షాక్‌లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు దారికి రారన్న ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి కొనసాగుతున్నప్పటికీ పార్టీ అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించారు.

ఆరునెలల సమయం ఇచ్చిన జగన్
ఇటీవలే పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే ఎమ్మెల్యేలపైనే ఎక్కువ బాధ్యత ఉంటుందని, ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని సూచించారు. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా తాను తెప్పించుకున్న సర్వే నివేదిక వివరాలపై వారితో మాట్లాడారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు ఆరునెలల సమయం ఇచ్చారు. ఆ తర్వాత తనను నిందించి ఉపయోగం ఉండదని, వేరేవారికి సీటు ఇస్తానని ఖరాఖండిగా చెప్పేశారు.

చెప్పినమాట విననివారిపై ప్రత్యేక దృష్టి
ఆ తర్వాత కూడా వైసీపీకి ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐప్యాక్ సర్వేలు నిర్వహించి నివేదికలు అందజేస్తోంది. అంతేకాకుండా ఇంటిలిజెన్స్ ద్వారా, ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీ ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. తాను చెప్పిన తర్వాత కూడా మాట వినకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను గుర్తించారని, వారిపై ఏం చేయాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటారని పార్టీవర్గాలు వెల్లడించాయి.

దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన ఎమ్మెల్యేలు
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగాలంటే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా రూ.12 కోట్లు విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. వీటిని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను, టీడీపీలో బలమైన నేతలు పోటీచేసే నియోజకవర్గాలను గుర్తించి వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో తమకు సీటు రావాలంటే పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి ''తాడికొండ'' రూపంలో స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలంతా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.












Click it and Unblock the Notifications