విద్యాదీవెన డబ్బులు విడుదల: తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లు: 10 రోజుల్లో ఫీజు: వైఎస్ జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యాదీవెన పథకం కింద లబ్దిదారులకు నిధులను విడుదల చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ మొత్తాన్ని లబ్దిదారుల అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. మొత్తం 686 కోట్ల రూపాయలు. జగనన్న విద్యాదీవెన పథకం కింద నిధులను విడుదల చేయడం వరుసగా ఇది మూడో సంవత్సరం. రాష్ట్రవ్యాప్తంగా 9,87,965 మంది తల్లుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ అయ్యాయి.

చదువుకు పేదరికం అడ్డుపడకూడదనే..
ఈ సందర్భంగా వైఎస్ మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జిల్లా కలెక్టర్లతో ముచ్చటించారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లోనూ ప్రతి సంవత్సరం నిధులను విడుదల చేస్తోన్నామని వైఎస్ జగన్ అన్నారు. పేదరికం పెద్ద చదువులకు అడ్డు రాకూడదనే కారణంతో ఈ పథకాన్ని రూపొందించామని, దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

పేదరికాన్ని రూపుమాపే శక్తి చదువు ఒక్కటే..
పేదరికాన్ని రూపుమాపే శక్తి చదువుకు మాత్రమే ఉందని, అందుకే పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి, విద్యార్థులకు అండగా నిలవడానికి జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన విద్యార్థులందరికీ వంద శాతం ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. 11.03 లక్షలమంది పిల్లల చదువు కోసం విద్యా దీవెన పథకం కింద 9,87,965 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 686 కోట్ల రూపాయలను జమ చేస్తున్నామని ఆయన అన్నారు.

వందశాతం ఉద్యోగాలను సాధించేలా..
వందశాతం అక్షరాస్యతను సాధించడం ఒక్కటే తమ లక్ష్యం కాదని, అదే స్థాయిలో విద్యార్థులు గ్రాడ్యుయేట్లు కావాలని తపన పడుతున్నామని వైఎస్ జగన్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పెట్టిన 1,778 కోట్లను కూడా మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటిదాకా విద్యారంగం మీద చేసిన ఖర్చు 6,259 కోట్ల రూపాయలుగా చెప్పారు. ఈ డబ్బులతో దాదాపుగా 21,48,477 మంది విద్యార్థులకు మేలు కలిగిందని వైఎస్ జగన్ వివరించారు.

కళాశాలలకు వెళ్లి.. ఆరాతీయండి..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. తల్లులు ప్రతి మూడు నెలలకోసారి కాలేజీలకు వెళ్లి ఫీజులు వారే చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయనే విషయంపై ఆరా తీయవచ్చని అన్నారు. కాలేజీల్లోని వసతులను ఆ తల్లులు పరిశీలించి.. లోటుపాట్లపై యాజమాన్యలను ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 1902 నంబర్‌కు కాల్ చేసి సంబంధిత కళాశాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావొచ్చని అన్నారు.

10 రోజుల్లో చెల్లించండి..
తల్లుల ఖాతాల్లో జమ అయిన పూర్తి రీఎంబర్స్‌మెంట్ సొమ్మును వారం, 10 రోజుల్లోపు కాలేజీలకు వెళ్లి తప్పకుండా చెల్లించాల్సిన బాధ్యత తల్లులపై ఉందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజులు అందిన తరువాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడతలో తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి కాకుండా.. ఆ ఫీజుల డబ్బులను నేరుగా కాలేజీలకు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

కోడింగ్, లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ..
డిగ్రీ కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుట్టామని, ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. 1 వ తరగతి నుంచి డిగ్రీ వరకు బైలింగ్వల్ విధానంలో విద్యను అందిస్తున్నామని చెప్పారు. 1.62 లక్షల మంది విద్యార్థులకు డేటా అనలిటిక్స్, ఆర్టిఫీషిషల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, కోడింగ్, లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్ వంటి 8,600 అంశాలను తీసుకుని వస్తామని చెప్పారు. విజయనగరం, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో కొత్త యూనివర్శిటీలు, కళాశాలకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications