ఆ మాట రానివ్వొద్దు-అధికారుల్ని కోరిన వైఎస్ జగన్..
ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేరనే మాట రాకూడదని సీఎం వైఎస్ జగన్ ఇవాళ అధికారుల్ని ఆదేశించారు.వైద్యారోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షలో క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్ చేయాలని, ప్రతి ఆస్పత్రినీ ఒక యూనిట్‌గా తీసుకుని ఆడిట్ చేయాలని సూచించారు. విలేజ్ క్లినిక్ నుంచి బోధనాసుపత్రి వరకూ ఈ ఆడిట్ జరగాలన్నారు. అవసరమైన మేరకు ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు, ఇతరత్రా సిబ్బంది ఎక్కడ ఖాళీగా ఉన్నా గుర్తించి భర్తీచేయాలన్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న రిక్రూట్‌మెంట్ బోర్డు వెంటనే వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. సరిపడా సిబ్బంది ఉంటే సగం సమస్యలు సమసిపోతాయన్నారు. దీంతోపాటు మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారని, ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. గత వారంరోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏపీ 23 స్థానంలో ఉందన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కేవలం 24 మంది మాత్రమేనని తెలిపారు. వీరంతా కోలుకుంటున్నారని వెల్లడించారు.సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించామని, చాలా స్వల్ప సంఖ్యలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించామన్నారు. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని జగన్ ఆదేశించారు. ఒక గ్రామానికి వెళ్లిన తర్వాత వైద్యుడు ఏం చేయాలన్నదానిపై నిర్దేశించుకున్న ఎస్‌ఓపీ కచ్చితంగా అమలు కావాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వచ్చేముందు ఎప్పుడు వస్తున్నారన్న దానిపై ముందుగానే తేదీలు ఇవ్వాలన్నారు. ఆ తేదీలను ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా గ్రామాల్లో ప్రజలకు తెలిపేలా చేయాలన్నారు. దీనివల్ల వారు ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వచ్చి వైద్యం పొందుతారన్నారు.
అలాగే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలన్నారు. అలాగే రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా నివారించాలన్నారు.












Click it and Unblock the Notifications