ఏపీలో టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్... లాంచ్ చేసిన సీఎం జగన్... ఇకపై అందుబాటులోకి 'ఈ-హుండీ'...
రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాలను ఒకే వ్యవస్థ కిందికి తీసుకువచ్చేందుకు టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం(మార్చి 15) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేవాలయాల్లో అవినీతి కట్టడికి టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉపయోగపడుతుందన్నారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో స్వచ్చమైన, పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకే ఈ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ఇకపై దేవాలయాల సమాచారం, భక్తులకు అవసరమైన సేవలు, ఆన్ లైన్ సేవల వివరాలు,ఆలయాల ఆదాయ వ్యయాలు, సిబ్బంది వివరాలు, పండుగ దినాల నిర్వహణ, పర్వదినాలు-ఉత్సవాల క్యాలెండర్, ఆస్తుల నిర్వహణ తదితర వివరాలన్నీ టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ-హుండీ సదుపాయం ద్వారా భక్తులు కానుకలు సమర్పించే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈభక్తులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ-హుండీలో కానుకలు సమర్పించవచ్చు. ఈ ఆన్‌లైన్ పేమెంట్ వ్యవస్థను యూబీఐ నిర్వహించనుంది.

టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా తొలిసారిగా రాష్ట్రంలోని అన్నవరం ఆలయంలో ఈ-హుండీ విధానం అందుబాటులోకి వచ్చింది. సేవల ప్రారంభోత్సవం సందర్భంగా యూబీఐ రూ.10,116లను కానుకగా చెల్లించింది. ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఈ హుండీ విధానం అందుబాటులోకి రానుంది. తద్వారా భక్తులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి హుండీ చెల్లింపులు చేయవచ్చు.
టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్,ఎండోమెంట్ కమిషనర్ అర్జునరావు,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈవో కిరణ్ రాయ్,ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానంద రెడ్డి తదితరలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications