వైఎస్ జగన్ పోలవరం సందర్శనకు ముహూర్తం ఫిక్స్: వరదలోనూ శరవేగంగా
అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తోన్న ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమయ్యారు. ఈ నెల 14వ తేదీ నాడే ఆయన పోలవరాన్ని సందర్శించాల్సి ఉన్నప్పటికీ.. భారీ వర్షాలు కురవడం, వాతావరణం అనుకూలించకపోవడం వంటి పరిణామాల మధ్య అది వాయిదా పడింది. దీనితో ఈ పర్యటనను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు రీషెడ్యూల్ చేశారు. తేదీని నిర్ధారించారు. ఈ నెల 19వ తేదీన ఆయన పోలవరాన్ని సందర్శించబోతోన్నట్లు సమాచారం.
ఉదయం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో పోలవరానికి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నానికి తిరిగి వస్తారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తుదిదశకు చేరుకుంటోన్న నేపథ్యంలో వైఎస్ జగన్ అక్కడికి వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామంటూ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనికి అనుగుణంగా నిర్మాణ పనులు కొనసాగాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్ విధించిన సమయం, భారీ వరదల్లోనూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు విరామం ఇవ్వలేదు ప్రభుత్వం. ప్రాజెక్ట్ పనులను రెట్టింపు వేగంతో చేపట్టింది. జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే బాలరాజు, నీటి పారుదల శాఖ అధికారులు పలుమార్లు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉందంటూ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో- జల వనరుల మంత్రిత్వ శాఖ దీని మీదే దృష్టి కేంద్రీకరించింది.

ఇప్పుడు కూడా గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. భారీగా వరదనీరు చేరింది. అయినప్పటికీ- నిర్మాణ పనులు ఆగట్లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రాజెక్ట్ వద్ద నిర్మించాలని జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహం ఎత్తు 100 అడుగులు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైఎస్ జగన్ పరిశీలించి, తుది ఆమోదం తెలుపుతారని సమాచారం.












Click it and Unblock the Notifications