మణిబంధనం.. వైఎస్ జగన్ యుద్ధ తంత్రం!!
అద్వితీయమైన మెజారిటీతో అధికారం చేపట్టిన పార్టీ రెండోసారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు ఏమీకాదు. రెండోసారి 175 సీట్లతో అధికారాన్ని దక్కించుకోవడానికి వైఎస్ జగన్ యుద్ధతంత్రాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని అమలుపరిచే కోణంలో కఠిన నిర్ణయాలకు కూడా వెనకాడటంలేదు.

కఠిన నిర్ణయాలుంటాయి.. సిద్ధపడాలి
అన్నింటికన్నా కఠిన నిర్ణయం... సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడం. వారితో సమావేశమైన ప్రతిసారి పనితీరు బాగోనివారికి కొంత సమయం ఇవ్వడంతోపాటు మెరుగుపరుచుకోవడానికి కొన్ని సూచనలు కూడా అందజేస్తున్నారు. అప్పటికీ వారిలో మార్పురాకపోతే సీటు లేనట్లే. అందుకు కొంతమంది సిద్ధపడి ఉండాలని జగన్ ముందునుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. తనకు అత్యంత ఆప్తులైనాసరే, తనకు సన్నిహితంగా ఉన్నవారైనా సరే.. గెలవలేరు అనుకుంటే వారిని పక్కన పెట్టడానికి జగన్ సిద్ధమవుతున్నారు.

సర్వే ప్రకారం చర్యలు..
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకుగాను 151 సీట్లతో అధికారం చేపట్టిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో పలువురు సీనియర్లకు కూడా సీట్లు నిరాకరించే అవకాశం కనపడుతోంది. ఐప్యాక్ నిర్వహించే సర్వే ప్రకారం వారి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి ఐదుగురు, నెల్లూరు జిల్లా నుంచి ఐదుగురు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐ ప్యాక్ తోపాటు తన సొంత మీడియా ద్వారా నిర్వహింపచేసిన సర్వేను క్రోడీకరించుకొని జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారు. వారిలో జగన్ బంధువులు కూడా ఉన్నారంటున్నారు.

సన్నిహితంగా ఉన్న సరే..నో టికెట్?
అంతేకాదు.. తనకు సన్నిహితంగా మెలుగుతున్నవారిలో కూడా కొందరికీ సీటు కష్టమేననే అభిప్రాయం పార్టీలో వినపడుతోంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమిపాలైనవారిని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశంతోపాటు కృష్ణా, గుంటూరు , ఉత్తరాంధ్రలో పలువురిని పక్కన పెట్టబోతున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయమే ఉండటంతో ఇప్పటికే ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నవారు తమ పనితీరును మెరుగుపరుచుకోవడం కష్టమని అంచనా వేస్తున్నారు. వారికి పార్టీపరంగా పదవులు కేటాయించి తప్పించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎమ్మెల్యేలెవరు? అనేది త్వరలోనే ఒక స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications