కోడి కత్తి కేసులో కీలక పరిణామం-మినహాయింపు కోరిన జగన్ ...
ఏపీలో గత ఎన్నికల సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి జరిగింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసును తొలుత స్ధానిక పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న వైఎస్ జగన్ ను కోర్టులో హాజరుపర్చాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.

ఇవాళ జరిగే విచారణకు సీఎం జగన్ హాజరయ్యేలా చూడాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు గతంలో ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు ఇచ్చింది. అయితే చివరి నిమిషంలో ఈ కేసు విచారణకు తాను హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన న్యాయవాదితో కోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో కోర్టు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. కోడి కత్తి కేసులో ఇప్పటివరకూ సీఎం జగన్ వాంగ్మూలం నమోదు చేయకపోవడంపై ఎన్ఐఏ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

కోడికత్తి దాడి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ కోసం పెట్టుకున్న అభ్యర్ధనలను ఎన్ఐఏ కోర్టు గత ఏడుసార్లు తిరస్కరించింది. ఈ కేసు కొలిక్కి రాకపోవడంత శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వడం లేదు. దీంతో నాలుగేళ్లుగా శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మగ్గుతున్నాడు. మధ్యలో ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ నుంచి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కూడా కోరాడు. ఈ పత్రం ఇచ్చారో లేదో తెలియదు కానీ శ్రీనివాస్ కు బెయిల్ మాత్రం రాలేదు. దీంతో బాధితుడిగా ఉన్న జగన్ వాంగ్మూలం ఇస్తే ఈ కేసు విచారణను కొలిక్కి తెచ్చేందుకు కోర్టు ప్రయత్నిస్తోంది. ఈ లోపు జగన్ మినహాయింపు కోరారు.












Click it and Unblock the Notifications