TDP సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ ప్రత్యేక వ్యూహం?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలను దక్కించుకోగా అందులో గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి, చీరాలలో గెలుపొందిన కరణం బలరాం, విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వారు వైసీపీలో చేరినప్పటికీ ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా కలుపుకొని మొత్తం 23 శాసనసభ స్థానాల్లో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నారు.

ఇరు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం
రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని వైసీపీ, టీడీపీ అధినేతలకు తెలుసు. అందుకే ప్రతి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సీఎం జగన్ వివిధ సంస్థల ద్వారా సర్వేలు నిర్వహింపచేస్తూ ఆయా సంస్థల నుంచి అందిన వివరాలను క్రోడీకరించే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేల్లో ఎవరైనా పనితీరు మెరుగుపరుచుకోకపోతే సీటివ్వనని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరును బట్టే ప్రజలు ఓట్లేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చడానికి సిద్ధపడుతున్నారు.

ఎమ్మెల్సీ పదవులతో అభ్యర్థుల బలోపేతం?
టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ ఛార్జిలకు ప్రభుత్వపరంగా ఏదో ఒక పదవిని కట్టబెడుతున్నారు. ప్రజల్లో తిరగడానికి, శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి ఇలాంటి పదవి ఉండటంవల్ల అభ్యర్థికి అధికార బలం చేకూరుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబుపై బరిలో నిలబడ్డ భరత్ కు, టెక్కలిలో అచ్చెన్నాయుణ్ని ఎదుర్కోవడానికి సిద్ధమైన దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. దువ్వాడను గెలిపిస్తే గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడి చేతిలో ఓటమిపాలైన పేరాడ తిలక్ ను ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇచ్చారు.

కార్యకర్తలపై జగన్ భరోసా?
గుంటూరు పశ్చిమలో చంద్రగిరి ఏసురత్నానికి మిర్చియార్డు చైర్మన్ పదవిచ్చారు. రేపల్లెలో మంత్రి అంబటి రాంబాబును నిలబెట్టే అవకాశాలున్నాయి. ఇలా ప్రతి టీడీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి అక్కడి పరిస్థితులనుబట్టి వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి వీరికి కట్టబెట్టే ప్రభుత్వ పదవులు ఉపయోగపడతాయని, ఇతర అభ్యర్థులకన్నా అధికార బలం ఉండటంతో వీరంతా బలమైన అభ్యర్థులుగా మారతారని జగన్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications