ఈ రెండు జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన..రేపే: చురుగ్గా ఏర్పాట్లు
మిఛౌంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిశాయి. పెద్ద ఎత్తున పంట నీటి పాలయింది. పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంట నష్టం వివరాలు నమోదు చేస్తోంది. దీనికి సంబంధించిన అంచనాలు రూపొందించి, రైతులకు పంటల భీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది.
ఈ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని దాటిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా- నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, బాపట్ల.. జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. అనేక లోతట్లు ప్రాంతాలను ముంచెత్తాయి. ఆయా జిల్లాల్లోని చెరువులు పొంగిపొర్లాయి. తీరప్రాంతవాసులను ప్రభుత్వం సురక్షిత ప్రదేశాలకు తరలించింది. ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగింది.

ఎనిమిది జిల్లాల్లో 320 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 20,572 మందిని తరలించింది. వారందరికీ భోజనం, మంచి నీటి సౌకర్యం కల్పించింది. నిత్యావసర సరుకులను సైతం పంపిణీ చేసింది. బాధిత కుటుంబాలు మళ్లీ తమ ఇళ్లకు వెళ్లే ముందు ఆర్థిక సాయంగా రూ.1000 నుంచి రూ.2500 అందించింది.
కాగా- వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. బాపట్ల, తిరుపతి జిల్లాల్లో గురువారం ఆయన పర్యటన షెడ్యూల్ అయింది. బాపట్లతో పాటు తిరుపతి జిల్లాలోని గూడూరుకు వెళ్లనున్నారు. తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.
బాపట్ల, గూడూరు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలను జగన్ సందర్శిస్తారు. పంట నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. పంట నష్టంపై వారిని అడిగి తెలుసుకుంటారు. వరద బాధితులు, రైతులకు అప్పటికప్పుడే అధికారులకు అవసరమైన ఆదేశాలను జారీ చేస్తారు.
తొలుత ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో వైఎస్ జగన్ వెంట.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్, వైద్య- ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఉంటారు. తిరుపతి, బాపట్ల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు జగన్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications