ఇరాన్ - అమెరికా మధ్య ఒప్పందం.. భారత్ చేతిలోనే.. టెహ్రాన్ రాయబారి సంచలనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం అలాగే ఉంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సైద్ రజా మొసయెబ్ మొత్లాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా మధ్య ఒప్పందం విషయంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తద్వారా పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను పెంపొందించొచ్చని అన్నారు. ఇరాన్- అమెరికా దేశాలను తిరిగి ఒప్పందంపైకి తీసుకువచ్చేంత శక్తి భారత్ కు ఉందని పేర్కొన్నారు. భారత్.. శాంతిని ప్రేమించే దేశం అని కొనియాడారు. ఈ మేరకు పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ తనవంతు కృషి చేయాలని కోరారు.
" మేము ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాం. భారత్ గొప్ప దేశం. ఇక్కడి ప్రజలు గొప్పవారు. భారత్ శాంతిని ప్రేమించే దేశం" అని ఇరాన్ కాన్సుల్ జనరల్ సైద్ రజా మొసయెబ్ మొత్లాగ్ పేర్కొన్నారు. ఇరాన్- అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇప్పటికే అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాన్ని కుదుర్చేందుకు చాలా దేశాలు మధ్యవర్తులుగా మారాయని అన్నారు. కానీ భారత్ కు ఈ విషయంలో ఎక్కువ అవకాశం ఉందని.. భారత్ తలచుకుంటే ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం తథ్యం అని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుకునేందుకు కేవలం దౌత్య మార్గాన్నే ఆచరించాలని భారత్ చాలా ఏళ్లుగా పాటిస్తోందని మొత్లాగ్ స్పష్టం చేశారు.

అనేక దేశాల్లో నెలకున్న అస్థిరతను తగ్గించేందుకు భారత్ దౌత్య మార్గాన్ని ఆవలంభించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఘర్షణలు తలెత్తితే దౌత్య మార్గం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రధాని మోదీ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ స్పష్టం చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై నియంత్రణ అమెరికాకే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడాన్ని మొత్లాగ్ తీవ్రంగా ఖండించారు. ఇక హార్మూజ్ జలసంధి తమ భూభాగంలోనే ఉందని ఈ మేరకు ఇటీవల ట్రంప్ ఓ మ్యాప్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.












Click it and Unblock the Notifications