బిజినెస్‌మ్యాన్‌గా కాదు..నాన్నగానే చూశా:గౌతమ్ అదానీపై కరణ్ అదానీ ఎమోషనల్ పోస్ట్..!
అదానీ గ్రూప్ తీవ్రమైన ఆరోపణలు, సవాళ్లు ఎదుర్కొన్న సంక్షోభ సమయంలో తన తండ్రి గౌతమ్ అదానీ వ్యవహరించిన తీరుపై ఆయన కుమారుడు, అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ అత్యంత భావోద్వేగపూరితంగా స్పందించారు. హిండెన్‌బర్గ్ సృష్టించిన కలకలం, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) విచారణల వంటి కఠిన పరీక్షల కాలంలో ఒక కొడుకుగా తన తండ్రిని చూస్తూ ఎలా గడిపారో వివరిస్తూ ఆయన లింక్డ్‌ఇన్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు.
ఆ ఒడుదొడుకుల కాలంలో తనను ప్రతి ఒక్కరూ అడిగిన అతిపెద్ధ ప్రశ్న ఏమిటంటే, ఒక కుమారుడిగా మీ తండ్రి ఎదుర్కొన్న ఈ సంక్షోభాన్ని ఎలా చూశారు అని కరణ్ తెలిపారు. ఆ కఠిన పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం తనకు చాలా కష్టంగా ఉండేదని అంగీకరించారు. ఇప్పుడు ఆ గండాలు దాటిన తర్వాత పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, ఒక వ్యాపారవేత్తగా సంస్థ ఎదుర్కొన్న ఒత్తిడి వేరని, ఒక కొడుకుగా కళ్లముందు అనుభవించిన మానసిక వేదన మరింత భారమైనదని ఆయన రాసుకొచ్చారు.

ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేస్తూనే తమ కుటుంబంపై వచ్చే ఆరోపణలు, విమర్శలతో కూడిన వార్తా పత్రికల కథనాలను చూడటం ఎంతో బాధ కలిగించేదని కరణ్ ఆవేదన చెందారు. తన జీవితమంతా ఒక రోల్ మోడల్‌లా భావించిన తండ్రి చుట్టూ ఇన్ని వివాదాలు ముసురుతుంటే మనసు కోపంతో, ఆందోళనతో విలవిలలాడేదని పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తి ఎన్ని ఆరోపణలను తనపై వేసుకోగలడనే భయం తనను వెంటాడేదని, కానీ తన తండ్రి వాటన్నింటినీ దాటుకుంటూ ప్రశాంతంగా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
నిశ్శబ్ద పోరాటం - అసలైన నిబ్బరం
విమర్శకులు ఎంతగా దాడి చేస్తున్నప్పటికీ, అసలైన ధైర్యమంటే గట్టిగా నినదించడం కాదని, మౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోవడమేనని తన తండ్రి ఆచరించి చూపించారని కరణ్ కొనియాడారు. కష్ట సమయాల్లో కూడా చుట్టూ ఉన్న ప్రజలతో ఆయన ప్రవర్తించిన తీరు మార్చుకోకపోవడం తనకు పెద్ద పాఠమని అన్నారు. కుటుంబం తుపానులో చిక్కుకున్నా సరే దేశ పురోభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతో ప్రాజెక్టులు ఎక్కడా నిలిచిపోకుండా చూశారని తెలిపారు. పోర్టులు నిరంతరం నడవడం, విద్యుత్ అందడం, విమానాశ్రయాలు సేవలు అందించడమే ఆయన చూపిన నిజమైన సమాధానమన్నారు.
సగటు కొడుకులాగే తాను కూడా తండ్రిని ఎప్పుడూ ఒక దిగ్గజ వ్యాపారవేత్తగా కాకుండా, కేవలం 'నాన్న' అని మాత్రమే పిలుచుకుంటానని తెలిపారు. ఆడంబరమైన ప్రసంగాలకు దూరంగా ఉండే గౌతమ్ అదానీ, దేశ ప్రగతికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా జీవిస్తున్నారని కరణ్ వివరించారు. భారతదేశ ప్రగతి పరుగులకు అదానీ గ్రూప్ నిర్మించే మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఊతమిస్తాయో అనే గట్టి దృఢ సంకల్పం తన తండ్రి చేత ప్రతి బలమైన నిర్ణయం తీసుకునేలా చేసిందని రాసుకొచ్చారు.
వ్యక్తిగతంగా ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించినప్పటికీ, దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలవడమే నిజమైన గెలుపని నిరూపించడమే ఈ మూడు సంవత్సరాల ప్రయాణంలో తాను నేర్చుకున్న గొప్ప విషయమని కరణ్ ముగించారు. వ్యాపార ఒత్తిడిని, సున్నితమైన కుటుంబ బంధాలను ఆవిష్కరించిన కరణ్ అదానీ భావోద్వేగపూరిత పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications
