ఏపీ కలెక్టర్ల సదస్సు-మెగా డీఎస్సీ తేదీ, తల్లికి వందనంపై చంద్రబాబు ప్రకటన..!
ఏపీలో కలెక్టర్ల సమావేశం ఇవాళ అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఇందులో సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పనిచేయాలని ఆయన కోరారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని, కొందరు అభివృద్ధి చేస్తే..మరికొందరు నాశనం చేస్తారని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీఇచ్చామని, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమని తెలిపారు.
సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదన్నారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలన్నారు. తెలుగుదేశం పార్టి నాలుగు వందలతో ప్రారంభించిన పింఛను నాలుగు వేలకు చేశామని తెలిపారు. ఇది దేశంలో ఎక్కడా లేదన్నారు. 204 అన్నా క్యాంటిన్లు పెట్టామన, ఇదో స్పూర్తి అని తెలిపారు.

దీపం పథకం క్రింద ఆడబిడ్డలకు ఒక సిలెండర్ ఉచితంగా ఇచ్చామని, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామని, చెత్త పన్ను రద్దు చేశామని చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సీ ప్రకటన ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏబిసిడి నిర్ణయించామన్నారు. డిఎస్సీ పకడ్బంధీగా నిర్వహించాలని కోరారు. మెజారిటీ ఉద్యోగాలు తెలుగుదేశం పాలనలోనే ఇచ్చామని గుర్తుచేశారు. బిసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ ఇచ్చామని, చేనేతలకు జిఎస్టీ రద్దు చేశామని తెలిపారు.

టేకిట్ ఫార్ గ్రాంటెడ్ కాదు, బిచ్చగాలకు దానం చేసినట్లు కాదని, చివరి లబ్దిదారునికి కూడా సంక్షేమం అమలు జరగాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ విశాఖలోనో, అనకాపల్లి లోనే వస్తే ఇలాంటి మోడల్ లో ల్యాండ్ పూలింగ్ చేయాలన్నారు.
నేషన్ హైవేస్ కు 55 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని,75 వేల కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పనులని, తమకు సంబంధం లేదని కలెక్టర్లు అనుకోకూడదన్నారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications