అధిష్టానం నేతలు కూడా: ఎపి కాంగ్రెస్, టీవీ ఛానల్ ప్లాన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఓటమి ముందే ఖరారైందని, అసెంబ్లీలో స్థానం లేకపోవడం బాధాకరమేనని, హైకమాండులోని కొందరి ప్రవర్తన కూడా ఓటమికి కారణమని, విభజన కారణంగానే పార్టీ మునిగిపోయిందని విజయవాడ సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఆవేదన వ్యక్తం చేసారు. గెలుపోటములు కాంగ్రెస్‌కు కొత్త కాదని, అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాంగ్రెస్‌పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవటం చాలా బాధాకరంమన్నారు.
2009 ఎన్నికల ఫలితాల అనంతరమే.. 2014లో కాంగ్రెస్ గెలుపుపై నమ్మకం సన్నగిల్లిందన్నారు. ఇప్పటినుంచి కష్టపడి పని చేసి పార్టీని బతికించుకుందామని పిలుపునిచ్చారు. విభజన విషయంలో హైకమాండ్‌లోని కొందరు నేతలు వ్యవహరించిన తీరు, వారు మాట్లాడిన మాటల కారణంగా ఘోర పరాజయం పాలయ్యామనే నిర్ణయానికి వచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిపోయిన నేతలను తిరిగి చేర్చుకోవద్దని పలువురు డిమాండ్ చేశారు.
మొత్తం మీద అందరూ కలిసి కట్టుగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రతినిధులతో పీసీసీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి అధ్యక్షతన విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, కిల్లి కృపారాణి, జేడీ శీలం, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు డాక్టర్ శైలజానాథ్, కన్నా లక్ష్మినారాయణ, రామచంద్రయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, కొండ్రు మురళి, వట్టి వసంత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, దేవినేని నెహ్రుతో పాటు పలు జిల్లాలలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవటం చాలా బాధాకరమని పీసీసీ మాజీ చీఫ్ బొత్ససత్యనారాయణ అన్నారు. మీడియా లోతైన చర్చ లేకుండా ఒకే సామాజిక వర్గానికి వంతపాడిందని, కాంగ్రెస్‌పై ఇంకా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఓ చానల్ పెట్టుకుందాం
సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలకు కూడా చానల్స్ ఉండగా మనకు మాత్రం చానల్, పత్రిక లేకపోవటం విచారకరమని నాయకులు వ్యాఖ్యానించారు. నిధులు పోగుచేసి త్వరలోనే చానల్ ఏర్పాటు చేసుకుందామని కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం చెప్పారు.












Click it and Unblock the Notifications