2024లో గెలిస్తే జగన్ చేసేది ఇదే..! హిస్టరీ రిపీట్ ఖాయం-డిప్యూటీ సీఎం వార్నింగ్..
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైపోయింది. నిత్యం రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వారాహి యాత్రలో వైసీపీని, సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఇంకా కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఇవాళ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 2024లో వైఎస్ జగన్ గెలిస్తే ఏం చేస్తారో ఆయన చెప్పేశారు.
ఏపీలో 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచాక సీఎం జగన్ కొన్ని అకౌంట్లు సెటిల్ చేస్తారంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఇవాళ వ్యాఖ్యానించారు. ఇవాళ సచివాలయంలో దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించిన కొట్టు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో జగన్ వచ్చే ఏడాది తిరిగి గెలిచాక కొందరి అకౌంట్లు సెటిల్ చేస్తారంటూ పవన్ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ చేస్తున్న విపరీత వ్యాఖ్యల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని డిప్యూటీ సీఎం కొట్టు ఆరోపించారు. సీఎం జగన్ ను తిట్టిన ఎవరినైనా పాతాళంలోకి తొక్కేస్తారన్న సంగతి తెలుసుకోవాలన్నారు. 2024లో ధర్మం గెలవబోతోందని ఆయన తెలిపారు. మొత్తంగా హిస్టరీ రిపీట్ అవుతుందన్నారు. తద్వారా వైసీపీ మరోసారి గెలిచి అధికారం చేపట్టబోతోందని ఆయన చెప్పకనే చెప్పారు.
మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 591 దేవాలయాల పునరుద్దరణ, నూతన దేవాలయాల నిర్మాణానికి రూ.311 కోట్ల సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసినట్లు కొట్టు తెలిపారు. అయితే షరతులకు లోబడి ఇప్పటి వరకూ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టని, నిర్మాణ పనులు ప్రారంభించని దేవాలయాలకు నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు.

పురాతన దేవాలయాల పునరుద్ధరణ, కొత్త దేవాలయాల నిర్మాణానికి ప్రాధాన్యతా క్రమంలో సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసేందుకు ముందుగా మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టాలని, దేవాలయ నిర్మాణ పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే కొన్ని షరతులతో ప్రొసీడింగ్స్ జారీ చేశామన్నారు.












Click it and Unblock the Notifications