పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. 100 ప్రముఖ పుణ్యక్షేత్రాలకు పక్కా రోడ్లు!
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వెలసిల్లిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ఇబ్బందులను తొలగిస్తూ పంచాయతీరాజ్ శాఖ విప్లవాత్మక అడుగులు వేస్తోంది. ఏళ్ల తరబడి సరైన రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్న క్షేత్రాలకు పక్కా రోడ్లు నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పం తీసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో స్వయంగా పరిశీలించిన అంశాలతో పాటు, ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి 'గుడి బాట' పనులకు శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 120 కోట్ల భారీ వ్యయంతో 205 కిలోమీటర్ల మేర 100కు పైగా ప్రధాన ఆలయాలను అనుసంధానించే పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
కేవలం ఆలయాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని బడి, గుడి, ఆసుపత్రి, పంట పొలాలకు వెళ్లే మార్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రాం జీ, సాస్కీ తదితర నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా, నిర్మించే రహదారులు భక్తులకు సుదీర్ఘకాలం ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

శ్రీ సత్యసాయి శత జయంతికి ప్రత్యేక నిధులు
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆ జిల్లాలోని పుట్టపర్తి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా రూ. 30 కోట్లు కేటాయించారు. దీనిద్వారా దాదాపు 72 కిలోమీటర్ల మేర రహదారుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి కరకట్ట మార్గానికి సాస్కీ నిధులు కేటాయించగా, చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ అర్థగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయ రోడ్డుకు రూ. 3 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు.
పూర్తయిన 40 శాతం పనులు: ప్రారంభానికి సిద్ధంగా రహదారులు
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఇప్పటికే 26 రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారులకు సంబంధించిన పనులు సగం పైగా పూర్తయ్యాయి. ప్రఖ్యాత నరసింహ క్షేత్రాలైన అంతర్వేది, అహోబిళంతో పాటు మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ఘాట్ రోడ్డు పనులు పూర్తయ్యాయి.
అలాగే సత్యవేడు పరిధిలోని సింగిరికోన, సోమేశ్వరం తలుపులమ్మలోవ మార్గం, ఐ.ఎస్.జగన్నాథపురం ఘాట్ రోడ్లు కూడా రూపుదిద్దుకున్నాయి. వీటిని త్వరలోనే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. నిడదవోలు, రాయచోటి, తెనాలి, పూతలపట్టు నియోజకవర్గాల్లోని వివిధ ఆలయ రహదారుల పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేలా పంచాయతీరాజ్ శాఖ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.














Click it and Unblock the Notifications