కేంద్రం దగ్గరకు పవన్ కళ్యాణ్?
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏపీ ప్రగతి పైన, పారదర్శక పాలన విధానాలతో ప్రత్యేకమైన దృష్టిని సారిస్తున్నారు. ప్రతిరోజు శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్న పవన్ కళ్యాణ్ ఏపీ పురోగతి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ గ్రామీణ రోడ్లపై ఫోకస్ చేశారు.
గ్రామాలకు రహదారుల అనుసంధానం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
4976 కోట్ల రూపాయల నిధులతో 7213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలన్నారు పవన్ కళ్యాణ్ . ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు పవన్ దిశా నిర్దేశం చేశారు. గ్రామాలకు రహదారుల అనుసంధానం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

గ్రామాల రహదారుల అనుసంధానంపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశం
గ్రామాలలో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. రహదారుల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్ 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం చేయాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాండ్ 10 శాతానికి తగ్గించేలా తాము కేంద్రంతో మాట్లాడుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అవసరమైతే మరింత కేంద్ర సాయం కోరుతాం
గ్రామాలలో రహదారుల నిర్మాణం జరిగితే గ్రామ పురోగతి సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగుతాయని ఆయన తెలిపారు. గ్రామాలలో రహదారుల నిర్మాణానికి అవసరమైతే మరింత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుదామని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుపడిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
పనుల పారదర్శకత కోసం ప్రత్యేకమైన పోర్టల్
గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులు జాప్యం జరిగిందని, దీనివల్ల రోడ్ల నిర్మాణం జరగలేదన్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలు ప్రగతి సాధించలేకపోయాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తామన్నారు పవన్ కళ్యాణ్. దీనికోసం ప్రత్యేకమైన పోర్టల్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ప్రజల సలహాలు, సూచనలకు ప్రియారిటీ
అంతేకాదు ప్రజల సలహాలు సూచనలు తీసుకోవడానికి ఆ పోర్టల్ లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధికి, 250కు మించి జనాభా ఉన్న గ్రామాలలో రోడ్ల అనుసంధానానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిస్తుందని అంతా భావిస్తున్నారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications