చంద్రబాబు, లోకేష్ సభల్ని అడ్డుకోవట్లేదు-అక్కడ మాత్రం కుదరదన్న డీజీపీ..
విపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్ నిర్వహిస్తున్న బహిరంగసభలకు పోలీసులు అడ్డంకులు కల్పించడంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ స్పందించారు.
ఏపీలో జీవో నంబర్ 1 అమల్లోకి వచ్చాక పోలీసులు విపక్ష నేతల సభలపై కొరడా ఝళిపిస్తున్నారు. రోడ్లపై బహిరంగసభ పెడితే చాలు ఆంక్షలు అమలు చేసి అడ్డుకుంటున్నారు. తాజాగా అనపర్తిలో చంద్రబాబు సభను పోలీసులు అడ్డుకున్న తీరు రాష్ట్రంలో విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో డీజీపీ దీనిపై స్పందించారు.

తూర్పు గోదావరి జిల్లా జాంపేట రిజర్వు పోలీసు క్వార్టర్స్ వద్ద అత్యాధునిక వసతులతో కోటి ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన పోలీసు కన్వెన్షన్ సెంటర్ ను, జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో 45 లక్షలతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. గత మూడేళ్లలో ఆస్తి నేరాలు, శారీరక నేరాలు,వైట్ కాలర్, రోడ్డు ప్రమాదాలలో జనవరి, ఫిబ్రవరి నెలలలో-2021, 2022, 2023 సంవత్సరాలలో నమోదు అయిన కేసులను సమీక్షిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. విపక్షాల సభలకు పోలీసులు కల్పిస్తున్న అడ్డంకులపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల గొంతుక మేమెందుకు నొక్కుతామని ఆయన ఎదురు ప్రశ్నించారు. పోలీసులు నిర్ధేశించిన ప్రకారం ఖాళీ స్ధలాల్లోనే బహిరంగసభలు పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఇరుకైన ప్రదేశాల్లో సభలకు అనుమతివ్వమన్నారు. అనపర్తి ఘటనలపై నమోదైన కేసులపై వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామన్నారు. కాలేజీల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టినట్లు డీజీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications