ఏపీలో కొత్త జిల్లాలు అప్పటి నుంచే- మంత్రుల టూర్ ఫిక్స్..! రిపోర్ట్ కు డెడ్ లైన్..!
ఏపీలో జిల్లాల పునర్విభజనపై మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కోసం నియమించిన మంత్రుల బృందం ఇవాళ అమరావతి సచివాలయంలో సమావేశమైంది. ఇందులో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈరోజు సచివాలయంలో తొలిసారి భేటీ అయిన జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై నియమించిన మంత్రుల బృందం.. పలు అంశాలపై చర్చించింది. అనంతరం జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలోపు చేపట్టాల్సిన కసరత్తుకూ షెడ్యూల్ ఫిక్స్ చేశారు.

ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరించాలని మంత్రులు నిర్ణయించారు. ఈలోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్ కు పంపించవచ్చన్నారు. సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారని వారు తెలిపారు. గత ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్విభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.

డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు ప్రక్రియ ముగిస్తామని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు కోసం కసరత్తు చేస్తామని తెలిపారు. రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల బృందం పని చేస్తుందని వెల్లడించారు. నియోజకవర్గాల జోలికి మాత్రం వెళ్లబోమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని, అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయి అని తెలిపారు.












Click it and Unblock the Notifications