ఏపీ డీఎస్సీ పరీక్షపై నీలి నీడలు, వాయిదా విజ్ఞప్తులతో ఈసీ కోర్టులోకి బంతి..!
ఏపీలో డీఎస్సీ పరీక్షలను ఎట్టి పరిస్ధితుల్లో ఎన్నికలకు ముందే నిర్వహించాలన్న వైసీపీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. ఎన్నికలతో సంబంధం లేకుండా నిర్వహించేందుకు వీలుగా కొత్త షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్ ప్రకారం కూడా డీఎస్సీ నిర్వహించే పరిస్దితి లేనట్లు తెలుస్తోంది. ఈ మేరకు డీఎస్సీ వాయిదా కోరుతూ ఈసీకి భారీగా వినతులు వెల్లువెత్తాయి.

ఏపీలో తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 17 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే మార్చి 15న టెట్ ఫలితాలు విడుదల చేశాక కనీసం నెల రోజుల గ్యాప్ లేకుండా డీఎస్సీ పరీక్షల నిర్వహణ నిబంధనలకు విరుద్దమంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ఈ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం తిరిగి మార్చి 30 నుంచి డీఎస్సీ పరీక్షల నిర్వహణకు వీలుగా కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్ కూడా అభ్యర్ధులను మెప్పించలేకపోయింది.
ఎన్నికలు, వేసవి, ఇతరత్రా కారణాలతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు భారీగా వినతులు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే సీఈవో ముకేష్ కుమార్ మీనా విద్యాశాఖ వివరణ కోరారు. ఈ వివరణ వచ్చాక సీఈసీ దృష్టికి డీఎస్సీ పరీక్ష నిర్వహణ వ్యవహారం తీసుకెళ్తామని ఇవాళ వెల్లడించారు. సీఈసీ క్లియరెన్స్ ఇస్తేనే ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. లేకుంటే మరోసారి వాయిదా తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications