AP EAPCET 2023 : ఇంజనీరింగ్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల-ఆగస్టు 3వరకూ రిజిస్టేషన్లు..
ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2023 లో భాగంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్ 2023 షెడ్యూల్ ను సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి విడుదల చేసారు. ఇందులో భాగంగా అడ్మిషన్ల ప్రక్రియ, రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ఎంపిక, సీట్ల కేటాయింపు తేదీల్ని ఆమె ప్రకటించారు.
ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఈ ఏడాది నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్ష లో ర్యాంకులు సాధించిన వారికి అడ్మిషన్లు పొందేందుకు వీలుగా సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్దులు జులై 24 నుండి ఆగస్టు 3వ తేదీ లోపు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.

జులై 25వ తేదీ నుండి ఆగస్టు 4 వరకు సహాయ కేంద్రాల వద్ద ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఆగస్టు మూడవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు అభ్యర్దులు తమ వెబ్ ఆప్షన్లను ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆప్షన్ల మార్పు కోసం ఆగస్టు 9వ తేదీన ఒక రోజు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆగస్టు 12వ తేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతామని కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు.
ఇంజీనీరింగ్ ప్రవేశాలు కోరుతున్న అభ్యర్ధులు ఆగస్టు 13, 14 తేదీలలో వ్యక్తిగతంగా సీట్లు పొందిన కళాశాలల్లో రిపోర్టు చేయాలని, ఆగస్టు 16వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని నాగరాణి వివరించారు. ఇంకా పూర్తి వివరాలు, సహాయ కేంద్రాల సమాచారం కోసం cets.apsche.ap,gov.in వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల్ని కూడా రూ.42 వేల నుంచి లక్ష రూపాయల వరకూ నిర్ణయించారు. మూడేళ్ల పాటు ఇవి అమల్లో ఉండబోతున్నాయి. గత మూడేళ్లలో ఇవి రూ.35 వేల నుంచి రూ.70వేల వరకూ మాత్రమే ఉన్నాయి.












Click it and Unblock the Notifications