నేడు ఏపీ ఉద్యోగుల సెల్ డౌన్-ప్రభుత్వ యాప్ ల బాయ్ కాట్...
ఏపీలో ఉద్యోగులకు వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంపై ఉద్యమం చేస్తున్న ఏపీ జేఏసీ అమరావతి.. నిరసనల్లో ఇప్పటికే ఓ దశను పూర్తి చేసే తాజాగా రెండో దశలోకి అడుగుపెట్టింది. రెండో దశ ఉద్యమంలో భాగంగా వరుసగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలకు దిగుతున్న ఉద్యోగులు.. ఇవాళ సెల్ డౌన్ చేయాలని నిర్ణయించారు.
ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం పలు యాప్ లను వాడాలని నిర్దేశించింది. ఈ యాప్ ల వాడకంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందని ఏపీ జేఏసీ అమరావతి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సెల్ డౌన్ పేరుతో ఈ యాప్ లను వాడకుండా బాయ్ కాట్ చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఇవాళ ఒక్కరోజు ఈ యాప్ లు ఓపెన్ చేయకుండా తమ నిరసన తెలపాలని ఉద్యోగులు నిర్ణయించారు. దీంతో ఇవాళ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు సెల్ డౌన్ ప్రారంభమైంది.

వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు పలు హామీలు నెరవేర్చాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. అలాగే సకాలంలో జీతభత్యాలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ హామీలు నెరవేర్చుకుండా ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చి తప్పించుకుంటోందని ఏపీ జేఏసీ అమరావతి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండో దశ ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. ఈసారి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications