నేనున్నాను.. నేను విన్నానన్న సీఎం జగన్.. ఇప్పడు తాడేపల్లికే పరిమితమా..?
విజయవాడ పుర వీధులన్నీ ఎరుపెక్కాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో బెజవాడ వీధులు నిండిపోయాయి. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన 'చలో విజయవాడ' పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. దీంతో బెజవాడ వీధులన్నీ ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. చలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ఎన్ని ఆడ్డంకులు సృష్టించినా.. జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా విజయవాడకు తరలివచ్చారు. పోలీసుల అంచనాలకు తల్లకిందులు చేశారు. దీంతో చేసేదేమీ లేక పోలీస్ యంత్రాంగం చేతలెత్తేసింది..

తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారా...
విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమంతో ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పుకలగాని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. తమ హక్కుల కోసం పోరాడుతుంటే రాష్ట్రం ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే తమను తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదన్నారు.

సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమా..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను నిలువునా మోసం చేసిందని పీఆర్సీ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలతో ఇంతకాలం వెల్లదీశారని ఇక ఆటలు సాగవని హెచ్చరించారు. ఎన్నికల ముందు నేనున్నాను.. నేను విన్నానన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారని విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారని కలలో కూడా ఊహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే తమను రోడ్డుపైకి ఈడ్చారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టుదలకు పోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది
కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఉద్యోగుల పట్ల పట్టుదలకు పోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ పట్ల ఎందుకు అంత చిన్నచూపు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాం.. పాకిస్థాన్ లో కాదన్నారు. ఇంత అణిచివేత ధోరణి పనికి రాదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications