ఏపీలో కరెంటు ఛార్జీలపై భారీ ఊరట-తగ్గిన సగటు యూనిట్ ధర- కనీస ఛార్జీల రద్దు
ఏపీలో వైసీపీ సర్కారు విద్యుత్ ఛార్జీలపై మరో గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం అన్నట్లుగానే పెంచకపోగా.. యూనిట్ సగటు ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పేదలకు ఊరటనిచ్చేందుకు కనీస ఛార్జీలు కూడా రద్దు చేసింది. దీంతో భారీ ఎత్తున ప్రజలకు ఊరట లభించనుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి విద్యుత్ నియంత్రణ మండలి కొత్త ఛార్జీలను ఇవాళ విశాఖపట్నంలో ప్రకటించింది.

విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ సంస్ధలు నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధపడలేదు. ఈ మేరకు డిస్కంలు పంపిన ప్రతిపాదనలన్ని విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించింది. వీటి వివరాలను ఇవాళ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి విశాఖపట్నంలో ప్రకటించారు. తాజాగా సవరించిన ధరల ప్రకారం ప్రజలపై భారం పడకపోగా కొన్ని అంశాల్లో ఊరట లభించింది.

తగ్గిన సగటు యూనిట్ ధర
తాజాగా ప్రకటించిన విధానంలో ఏపీలో సరఫరా చేస్తున్న విద్యుత్ సగటు యూనిట్ ధరను తగ్గిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. డిస్కంల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు సగటు యూనిట్ ధరను రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గిస్తూ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. వివిధ సంఘాల సూచన మేరకు టారిఫ్ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులకు ఊరట దక్కనుంది.

కనీస ఛార్జీల రద్దు
తాజాగా అమల్లోకి వస్తున్న విధానం ప్రకారం గృహ వినియోగదారులకు భారీ ఊరట దక్కబోతోంది. ఇప్పటివరకూ విద్యుత్ వాడినా వాడకపోయినా కనీస ఛార్జీలు ఉండేవి. కానీ ఇప్పుడు తాజా విధానం ప్రకారం కనీస ఛార్జీలను ప్రభుత్వం ఎత్తేసింది. వీటి స్ధానంలో కిలో వాట్‌కు 10 రూపాయలు చెల్లిస్తే చాలని ఈఆర్సీ ఇవాళ ప్రకటించింది. ఫంక్షన్ హాళ్లకు కూడా నిర్ధిష్ట ఛార్జీలు తొలగిస్తున్నట్లు ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. దీంతో భారీ ఎత్తున వినియోగదారులకు లబ్ది కలగబోతోంది.

పరిశ్రమల కేటగిరీ నుంచి అక్వా, పౌల్ట్రీ తొలగింపు
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వర్తింపచేసే ఛార్జీల్లో పరిశ్రమల కేటగిరీ నుంచి అక్వా, పౌల్ట్రీ రంగాలను తప్పించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల ఉచిత విద్యుత్ కోసం రూ.7297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల బదులు తాత్కాలిక టారిఫ్‌ను వర్తింపచేస్తామన్నారు. ప్రభుత్వ విధానంలో భాగంగా రైతులకు, కులవృత్తులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications