ఈ మద్యం వ్యాపారం మాకొద్దు, రాష్ట్రంలో తొలి సారి- సీన్ రివర్స్..!!
ఏపీలో మద్యం వ్యాపారంలో ఊహించని పరిణామం. మద్యం షాపులు.. బార్లు దక్కించుకునేందుకు పోటీ పడే వ్యాపారులు అసలు మాకు వద్దంటూ దూరంగా ఉంటున్నారు. కొత్త బార్ల పాలసీ విఫలం అయినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. సగానికి పైగా బార్లకు ఒక్క టెండర్ దాఖలు కాలేదు. ఈ పరిస్థితి రాష్ట్రంలోనే తొలి సారి. దీంతో, ఎక్సైజ్ శాఖ మిగిలిన బార్లకు తిరిగి నోటీఫికేషన్ జారీ చేసేందుకు సిద్దమైంది. మరి.. వ్యాపారులు ఇప్పుడైనా ముందుకు వస్తారా.. అసలు ఏం జరుగుతోంది.
ఏపీ బార్ల పాలసీలో అంచనాలు తప్పాయి. కొత్త మద్యం పాలసీకి వ్యాపారుల నుంచి ఆదరణ కనిపించలేదు. సగానికిపైగా బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం అధికారులకు అంతు చిక్కటం లేదు. దీంతో, టెండర్లు వచ్చిన బార్లకు లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఖరారు చేసారు. ఓపెన్ కేటగిరీలో 840, కల్లుగీత కులాలకు 84 బార్లకు (మొత్తం 924) నోటిఫికేషన్ జారీ అయింది. ఓపెన్ కేటగిరీ బార్లు 388, గీత కులాల బార్లు 78 శనివారం లాటరీలోకి వచ్చాయి. ఇంకా 458 బార్లు దరఖాస్తులు రాక మిగిలిపోయాయి. వీటిలో 37 బార్లకు నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు అందాయి. 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలనే నిబంధన ఉండడంతో వాటికి లాటరీ నిర్వహించలేదు.

దీంతో, ఈ 37 బార్లకు దరఖాస్తులు సమర్పించే గడువును సోమవారం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. 2న లాటరీ తీస్తారు. అసలు దరఖాస్తులు రాని 421 బార్లకు త్వరలో రీనోటిఫికేషన్ జారీచేస్తామని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కోనసీమ జిల్లాలో ఒక్క బార్‌కు మాత్రమే లాటరీ తీశారు. విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో కొంత మెరు గు. మరీ ఆశ్చర్యంగా గీత కులాల బార్లలోనూ 6 మిగిలిపోయాయి. గీత కులాలకు రాష్ట్రవ్యాప్తంగా 84బార్లు కేటాయించారు.
వాటికి లైసెన్స్ ఫీజు 50 శాతమే. తీరా చూస్తే ఆరు బార్లకు 4 దరఖాస్తులు రాక లాటరీనే నిర్వహణ జరగలేదు. ఈ పాలసీ బాగోలేదని వ్యాపారులు తొలి నుంచీ చెబుతూనే వచ్చారు. వారిని పట్టించుకోకుండా అన్ని బార్లకూ దరఖాస్తులు అందుతాయనే అంచనాలు తల కిందులయ్యాయి. ఇక.. ఇప్పుడు రీనోటిఫికేషన్ పైన వ్యాపారులు ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications