ఏపీలో మొత్తం పెనన్లు పంచేశారా ? సర్వర్ సమస్యల మధ్య సర్కారీ లెక్కలివే..!
ఏపీలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం దాదాపు విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. పలు చోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినా వాటిని అధిగమించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దాదాపు 95 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ఇవాళ మిగిలిన ఒకటీ అరా పెన్షన్లను రేపు లబ్దిదారులకు అందించబోతున్నారు.
ఇవాళ ఉదయం ఆరు గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అమరావతిలోని పెనుమాకలో పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం ప్రతీ గంటా, రెండు గంటలకోసారి నివేదికలు వెల్లడించింది.

వీటి ప్రకారం సాయంత్రం ఆరున్నర కల్లా 93 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి కాగా.. సాయంత్రం 7:55కి 94.75శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 65,18,496 పెన్షనర్లకు గాను 61,76,158 మందికి పెన్షన్లు పంపిణీ చేశారని తెలిపాయి. మిగిలిన వారికి మాత్రం రేపు ఉదయం నుంచి తిరిగి పంపిణీ చేయబోతున్నారు. మొత్తం మీద రెండు రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేయబోతున్నారు.
అయితే ఇవాళ పలు చోట్ల సర్వర్లు మొరాయించడంతో పెన్షన్ల పంపిణీలో సమస్యలు తలెత్తాయి. గంటల తరబడి సర్వర్లు జామ్ కావడంతో లబ్దిదారులకు వేలిముద్రలు తీసుకుని పెన్షన్లు ఇవ్వడం అధికారులకు కష్టంగా మారింది. సాయంత్రానికి సర్వర్లపై ఒత్తిడి తగ్గింది. ఈ నేపధ్యంలో రేపు పెన్షన్ల పంపిణీ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications