సినిమా టికెట్ల ధరలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల్ని ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై వెలువడిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇవాళ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల్ని నిర్ణయించడానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం ఇకపై సినిమా టికెట్ల ధరల్ని నిర్ణయించబోతోంది.
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన పలు సినిమాల బెనిఫిట్ షోలకు ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునే అకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వానికి ఓ కమిటీని నియమించి దీని విధివిధానాలను ఖరారు చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ అధికారులతో కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరల పెంపుపై ఐదుగురు అధికారులతో కమిటీని నియమిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో 5 మంది సభ్యులతో కమిటి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కమిటీలో సభ్యులుగా సమాచార, ఆర్ధిక శాఖ, న్యాయ శాఖల కార్యదర్శులతోపాటు సినీ నిర్మాత వివేక్ కూచిభొట్లను నియమించారు. ఈ కమిటీ రాష్ట్రంలో సినిమాలకు బెనిఫిట్ షోల సందర్భంగా రేట్ల పెంపుపై పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications