Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసుల అవుట్-నెక్స్ట్ ఐపీఎస్ లు ?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నటి కాదంబరీ జెత్వానీని జైలుకు పంపి వేధించిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేసింది. మరికొందరిపై వేటుకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం పీఎస్ లో నమోదైన తప్పుడు కేసుపై దర్యాప్తు జరుగుతోంది. ఇది పూర్తయితే ఐపీఎస్ ల వంతు వస్తుందని భావిస్తున్నారు.

కాదంబరీ జెత్వానీ కేసులో తన పేరు బయటికి రాకుండా ఆమెను వేధించాలన్న ఓ పారిశ్రామిక వేత్త సూచనల ప్రకారం పోలీసులు పక్కా స్కెచ్ తో అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్ కు కూడా పంపారు. చివరికి ఆమెను ముంబైకి తిరిగి పారిపోయేలా చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి విజయవాడ కమిషనరేట్ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం పీఎస్ లో సీఐ ఎం సత్యనారాయణను ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు.
అప్పట్లో ఐపీఎస్ ల ఆదేశాలతో కాదంబరీ జెత్వానీపై తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా, ఆమెను ముంబైకి వెళ్లి అరెస్టు చేసి విజయవాడ తెచ్చి వేధించిన వ్యవహారంపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. వీరి తర్వాత కాదంబరీ జెత్వానీ వేధింపుల వ్యవహారాన్ని పైనుంచి నడిపించిన ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీపై వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిపై జెత్వానీ ఇబ్రహీంపట్నం పీఎస్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రభుత్వం వీరిపై అన్నీ ఆలోచించి తగిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications