ఏపీలో మద్యం షాపులన్నీ రద్దు-సర్కార్ కీలక ఆర్డినెన్స్ జారీ..!
ఏపీలో మద్యం షాపులపై ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం షాపుల ద్వారా భారీ ఎత్తున అవినీతి జరిగిందని అధికార కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు మద్యం విధానంలో మార్పులు చేయబోతోంది.ఇందుకు సన్నాహకంగా ఇవాళ కీలక ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులన్నీ రద్దు కాబోతున్నాయి. వీటి స్ధానంలో ప్రైవేటుకు ఈ బాధ్యత అప్పగిస్తారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకూ మద్యం షాపుల నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉండేది. అప్పట్లో వేలం పాటల ద్వారా మద్యం షాపుల్ని కేటాయించే వారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ విధానం రద్దు చేసి స్వయంగా ప్రభుత్వమే షాపుల్ని పెట్టి మద్యాన్ని అమ్మించింది. ఇందుకోసం భారీగా ఉద్యోగుల్ని కూడా నియమించింది. అలాగే కరోనా సమయంలో సైతం టీచర్లను మద్యం షాపుల వద్ద అమ్మకాల్ని నియంత్రించేందుకు కాపలా పెట్టింది. వీటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కొత్త మద్యం విధానం అమల్లోకి తెస్తామని ఎన్నికల్లో మూడు పార్టీలు హామీ ఇచ్చాయి. దీని మేరకు అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందు కోసం ఇప్పటికే అమల్లో ఉన్న ప్రభుత్వ మద్యం షాపుల్ని రద్దు చేస్తూ ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేశారు. వీటి స్ధానంలో గతంలోలాగే రిటైల్ షాపులకు వేలం పాటల ద్వారా అనుమతులు ఇవ్వబోతున్నారు. దీంతో ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తోందన్న అపప్రద కూడా తొలగిపోనుంది.












Click it and Unblock the Notifications