ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవా ? ఏపీ సర్కార్ ఫుల్ క్లారిటీ.. !
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన విద్యావిధానం ప్రకారం ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు. అలాగే 12వ తరగతి పరీక్షలు కూడా ఉండవనే మెసేజ్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాయాల్సిన విద్యార్ధులతో పాటు రాబోయే సంవత్సరాల్లో పరీక్షలు రాయబోయే వారు కూడా గందరగోళంలో పడ్డారు. వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్ పై ఏపీ ప్రభుత్వం ఇవాళ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
ఏపీలో పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలు ఇకపై ఉండబోవంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి స్పందించారు. పదో తరగతి పరీక్షలు ఉండవంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న మెసేజ్ లు పూర్తిగా తప్పని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కొత్త జాతీయ విద్యావిధానంలో కూడా 10వ, 12వ తరగతి పరీక్షలు ఉంటాయనే ఉంది ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఆయన సూచించారు.

అలాగే విద్యార్ధులు, టీచర్లకు కూడా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి సూచన చేశారు. ఇకపైనా ఎప్పటిలాగే పదో తరగతి, పన్నెండవ తరగతి పరీక్షలు తప్పకుండా ఉంటాయని ఆయన తెలిపారు. కాబట్టి టీచర్లు, విద్యార్ధులంతా పరీక్షలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారాలకు ప్రభావితం కాకుండా వారంతా పరీక్షలు రాసేందుకు, నిర్వహించేందుకు సిద్ధం కావాలని సూచించారు.
ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవా ? ఏపీ సర్కార్ ఫుల్ క్లారిటీ.. !#APGovt #SSCExams2023 #PublicExams #Students #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/vA3MjQwOZN
— oneindiatelugu (@oneindiatelugu) November 6, 2023
ఏపీలో ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో పలు విద్యాసంస్కరణలు తీసుకొచ్చింది. అలాగే కేంద్రం కూడా జాతీయ విద్యావిధానంతో పాటు పలు మార్పులు చేస్తోంది. కానీ ఎక్కడా పదో తరగతి పరీక్షలు కానీ, పన్నెండో తరగతి పరీక్షలు కానీ ఉండవనే ప్రస్తావనే రాలేదు. కానీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ పబ్లిక్ పరీక్షలు ఇకపై ఉండవంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications