AP Volunteers: వాలంటీర్ల కొనసాగింపుపై ఏపీ సర్కార్ నిర్ణయం అదేనా ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసమంటూ నియమించిన వాలంటీర్లు ఏ స్ధాయిలో పెత్తనాలు చేశారో అంతా చూశారు. సంక్షేమ పథకాల పంపిణీ కోసం నియమించిన వీరు.. లబ్దిదారుల ఎంపిక, స్థానిక వైసీపీ నేతలకు మద్దతుగా ప్రచారాలు, ఎన్నికల్లో వీరి కోసం చేసిన రాజీనామాలు ఇలా ఎటు చూసినా అప్పటి అధికార పార్టీతో అంటకాగిన వీరికి కూటమి ప్రభుత్వం వచ్చాక చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిపై ఏ నిర్ణయం తీసుకోబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
రాష్ట్రంలో వైసీపీతో అంటకాగిన వాలంటీర్ల వ్యవస్థపై అప్పట్లోనే విమర్శలు గుప్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, వాలంటీర్లకు ఇచ్చే జీతం 10 వేలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దీంతో మెజార్టీ వాలంటీర్లు కూటమి వైపే మొగ్గారు. లక్షకు పైగా వాలంటీర్లు మాత్రం తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ అభ్యర్ధుల తరఫున ప్రచారాలు చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక తమను తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అప్పట్లో తమతో బలవంతంగా రాజీనామాలు చేసి ప్రచారానికి వాడుకున్న వైసీపీ నేతలపై కేసులు పెట్టాలని సూచించారు. ఈ మేరకు వారు పీఎస్ లలో ఫిర్యాదులు కూడా చేశారు.

ఇంత చేసినా అటు రాజీనామాలు చేసిన వాలంటీర్లను ఉద్యోగాల్లోకి తీసుకోని ప్రభుత్వం.. ఇప్పటికే వాలంటీర్లుగా కొనసాగుతున్న దాదాపు లక్షన్నర మందితో ఏ పనీ చేయించకుండా వదిలేసింది. వారి స్ధానంలో సచివాలయ సిబ్బందితో ఈ నెల పెన్షన్లు ఇప్పిస్తున్నారు. వాలంటీర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వంలో మంత్రులు చెప్తుంటే.. ఎమ్మెల్యేలు మాత్రం పారిశుధ్యపనులకు వారిని వాడుకోవాలని సలహాలు ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం మనసులో ఏముందన్న చర్చ జరుగుతోంది.
ఇప్పటికే వాలంటీర్లకు పనులు అప్పగించకుండా జీతాలు ఇచ్చేందుకు సైతం సిద్ధమవుతున్న ప్రభుత్వం.. రాజీనామాలు చేసిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకీ తీసుకోకపోవడాన్ని బట్టి చూస్తుంటే వీరి భవిష్యత్తు ఏంటో అర్థమవుతోంది. పరోక్షంగా ఇప్పటికే పనీ పాటా లేకుండా ఉన్న వారు సైతం రాజీనామాలు చేసి వెళ్లిపోయేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆందోళనతో వీరిలో కొందరుు రాజీనామాల బాట పడుతున్నారు. దీంతో ఎన్నికలకు ముందు లక్షలోపు ఉన్న రాజీనామాలు చేసిన వాలంటీర్ల సంఖ్య ఇప్పుడు లక్ష దాటిపోయింది. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో ఇలా ఎంత మంది వెళ్లిపోతారో చూసుకుని అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications